బీజేపీకి 24 గంటలూ హింస, విద్వేషాలే : లోక్‌సభలో మండిపడిన రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ జులై 01(ప్రజాక్షేత్రం): ఈ దేశంలో హిందూ సమాజం అంటే మోదీ, బీజేపీ, ఆరెస్సెస్సే కాదని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీవాళ్లు హిందువులమని చెప్పుకొంటూ హింసకు, విద్వేషాల వ్యాప్తికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అన్న మతాలు, మన మహనీయులు అహింస, నిర్భయం గురించి చెప్పారు. కానీ.. హిందువులుగా చెప్పుకొనేవారు హింస, విద్వేషాలు, అసత్య ప్రచారాల గురించే మాట్లాడుతుంటారు’ అని రాహుల్ బీజేపీపై మండిపడ్డారు. అయితే.. మోదీ స్పందిస్తూ.. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకమైనదని చెప్పడం తీవ్రమైన అంశమని అన్నారు. దానికి రాహుల్ కౌంటర్ ఇస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి చేసినవేనని స్పష్టం చేశారు. ‘నరేంద్రమోదీయే యావత్ హిందూ సమాజం కాదు.. బీజేపీయే యావత్ హిందూ సమాజం కాదు.. ఆరెస్సెస్సే యావత్ హిందూ సమాజం కాదు’ అని ఘాటుగా బదులిచ్చారు. రాజ్యాంగం పుస్తకం కాపీని, శివుడు, గురునానక్ చిత్రపటాలను రాహుల్‌గాంధీ సభలో ప్రదర్శించారు. ధైర్యం, అహింస శివుడి సందేశాలని చెప్పారు. ఇదే అంశంలో ఇతర మతాలు ప్రబోధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు. యావత్ హిందువులకు బీజేపీ ప్రాతినిథ్యం వహించడం లేదని స్పష్టం చేశారు. అధికారపక్షంలో వివిధ మతాలకు చెందినవారు ఉన్న సంగతిని గుర్తు చేశారు. ఈ సమయంలో హోం మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకుంటూ కోట్ల మంది హిందువుల మనోభావాలను రాహుల్ దెబ్బతీశారని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పనిలోపనిగా ఎమర్జెన్సీ అంశాన్ని ఎత్తుకున్న అమిత్‌షా.. దేశంలో భయోత్పాతాలను వ్యాప్తి చేసిన కాంగ్రెస్‌కు అహింస గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. రాహుల్ తన ప్రసంగం కొనసాగిస్తూ.. ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, జైనం, సిక్కిజం అన్ని మతాలు సాహసం, నిర్భయం గురించి చెప్పాయన్నారు. దేశ రాజ్యాంగంపై, భారతదేశ మౌలిక సిద్ధాంతాలపై బీజేపీ పద్ధతి ప్రకారం దాడి చేస్తున్నదని రాహుల్ గాంధీ విమర్శించారు. అధికార పార్టీ ప్రతిపాదించిన ఆలోచనలను కోట్ల మంది తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మోదీ ఆదేశాల మేరకు నాపై దాడులు జరిగాయి. నాపై 20కిపైగా కేసులు పెట్టారు. నా ఇంటిని లాక్కున్నారు. 55 గంటలపాటు నేను ఈడీ విచారణను ఎదుర్కొన్నాను’ అని చెప్పారు. అన్ని సవాళ్లను ఎదుర్కొని కూడా సమిష్టి కృషితో రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నించడం గర్వకారణంగా ఉన్నదన్నారు. తన తర్వాత బీజేపీ నాయకులు ఇప్పుడు రాజ్యాంగానికి జై కొట్టడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నదని చెప్పారు. ప్రతిపక్షంలో కూర్చొన్నందుకు గర్వంగా ఉన్నదని అన్నారు. ‘ప్రతిపక్షంలో ఉన్నందుకు నేను సంతోషంగా, గర్వంగా ఉన్నాను. మాకు ఇది అధికారం కంటే ఎక్కువ. ఇది నిజం’ అని రాహుల్ చెప్పారు.