*అసైన్డ్ భూములు తారుమారు*
*-ఆన్‌లైన్ రికార్డు తప్పులతో రైతులకు తిప్పలు*
*-కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోని అధికారులు*
*-అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న రైతులు*
కొండాపూర్, జూలై 02(ప్రజాక్షేత్రం): అధికారుల నిర్లక్ష్యంతో కోట్లు విలువ చేసే అసైండ్ (ప్రభుత్వ) భూములు తారుమారయ్యాయి. సాగుచేస్తున్న రైతుల భూములు ఆన్‌లైన్ నమోదులో తప్పులు దొర్లి రైతులు తిప్పలు పడుతున్నారు. 2017లో జరిగిన భూ ప్రక్షాళన ధరణి పట్టా పాస్ పుస్తకాలను 2018-19లో రైతులకు రెవెన్యూ అధికారులు అందజేశారు. కానీ ఆన్‌లైన్ రికార్డు నమోదులో తప్పులు దొర్లాయనితహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవుపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 92లో ఇల్టేపు కిష్టయ్యకు మూడెకరాలు, కుమ్మరి నర్సింహులుకు మూడెకరాల అసైన్డ్ భూమి ఉన్నది. ఖస్రా, కబ్జా కాలం నాటి నుంచి తాత, తండ్రి వారి ఆధీనంలో సాగుచేస్తున్నారు. 2017 భూప్రక్షాళనలో వారికి కొత్త పాసు పుస్తకాలు అందలేదు. దాదాపు ఐదేళ్లుగా ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరిగినా ఆన్‌లైన్, ధరణి పట్టా పాసు పుస్తకాలు అందలేదు. సిహెట్ కొనాపూర్ గ్రామానికి చెందిన బేగరి పర్మయ్య తండ్రి రత్నయ్యకు 40, 54, 180 సర్వే నంబర్లలో 2 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నది. పట్టాదారు చనిపోవడంతో.. అదే గ్రామానికి చెందిన బేగరి పర్మయ్య తండ్రి సాయన్న వారసులకు రెవెన్యూ అధికారులు పౌతి మార్పిడి చేశారు. అప్పటి నుంచి బాధితులు అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. ఆన్‌లైన్‌లో వారికి నమోదు కాలేదు.
*అసైన్డ్ భూమిని ఆన్‌లైన్‌లో మార్పు..*
మన్‌సాన్‌పల్లిలో సర్వే నంబరు 192లో టీడీపీ ప్రభుత్వం (ఎన్టీఆర్ హయాం)లో రైతులకు భూ పంపిణీ చేసింది. అందులో మందుల ఆంజనేయులుకు రెండు ఎకరాల భూమి సర్టిఫికెట్‌ను రెవెన్యూశాఖ ఇచ్చింది. ఆ భూమిని హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పహాణి రికార్డులో నమోదు చేసి అధికారులు ఆన్‌లైన్ చేశారు. మల్కాపూర్ రెవెన్యూ కుతుబ్‌షాయిపేటలో 16, 20 సర్యే నంబర్‌లో రూ.కోట్లు విలువల చేసే ప్రభుత్వ భూములు నోటరీ పద్ధతిలో క్రయవిక్రయాలు జరిగాయి. వ్యవసాయ సాగు భూమిగా.. చూపుతూ కోళ్లఫాం, పండ్ల తోటలతో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నారు. ప్రభుత్వ భూమిని అమ్మినా.. కొన్నా.. చట్టరీత్యా నేరమన్న అధికారులు.. పౌతి, పట్టా మార్పిడి వలే రికార్డు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
*తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం*
తెలంగాణ ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరుతో సాగుచేస్తున్న భూమిని ఆన్‌లైన్ నమోదు చేయకుండా అధికారుల తప్పిదం వల్ల ధరణి పాస్‌బుక్ అందక రైతుబంధు కోల్పోయాం. తాత, తండ్రి కాలం నుంచి సాగులో ఉండి జీవనోపాధి పొందుతున్నాం.. ఏ అధికారి దగ్గరకు వెళ్లినా క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తామంటూ ఐదేళ్లు గడిచిపోయింది. కార్యాలయాల చుట్టూ తిరిగి అప్పులపాలయ్యాం. అధికారులు స్పందించి తమ సాగు భూమిని ఆన్‌లైన్‌లో చేర్చాలి.
– *ఇల్టెపు లక్ష్మయ్య, రైతులు, మునిదేవునిపల్లి*
*తమ పరిధిలోని పనులను సత్వరమే పరిష్కరిస్తాం*
తమ అధీనంలో అయ్యే పనులను సత్వరమే పరిష్కరిస్తున్నాం. మునిదేవునిపల్లి అసైండ్ భూమిలో రైతులకు అక్కడున్న భూమి ఎక్సె్‌సలో ఉంది. మల్కాపూర్, మాన్‌సాన్‌ల్లిలో భూముల్లో అప్పటి రికార్డు తమకు తెలియదు.అయినా ఆ భూములపై కోర్టులో కేసు నడుస్తుంది.ప్రభుత్వ భూములో చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఉన్నతాధికారుల దృష్ఠికి తీసుకె⁶ళ్లి చర్యలు తీసుకుంటాం.