డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షలో కీలక అంశాలు వెలుగులోకి
కాకినాడ జులై 02(ప్రజాక్షేత్రం): డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో నిర్వహించిన సమీక్షలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరప మండలం గురజనాపల్లిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రొయ్యలఫ్యాక్టరీ ఆక్వా కాలుష్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న పవన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రొయ్యల ఎగుమతి ఫ్యాక్టరీ నుంచి భారీగా కాలుష్యం వెలువడుతుండడంపై మండిపడ్డారు. అసలు అక్కడ ద్వారంపూడికి చెందిన వీరభద్ర ఆక్వా కంపెనీ ఉందనే విషయం తెలుసా అని అధికారులను పవన్ నిలదీశారు. వ్యర్థ జలాలను డ్రైనేజీలలో కలుపుతున్నా పట్టించుకోకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కంపెనీపై తనకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ పేర్కొన్నారు. కంపెనీ కాలుష్యానికి సంబంధించి 24 గంటల్లో నివేదిక పంపాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు.
*దౌర్జన్యానికి పాల్పడ్డ ద్వారంపూడి*
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా ఆయన నిర్మించిన నాలుగు అంతస్తుల భవనానికి సంబంధించి అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆయన చిందులు తొక్కారు. అక్కడికి వెళ్లిన అధికారులను చూసి రెచ్చిపోయారు. ముందుగానే నోటీసులు ఇచ్చినా స్పందించని ఆయన మంగళవారం భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన కార్పొరేషన్ అధికారులకు అడ్డు తగిలారు. కూల్చేందుకు వీలులేదని వారించారు. తనపై నుంచి వెళ్లి కూల్చాలని అడ్డుకున్నారు. ఇక రెచ్చిపోయిన ద్వారంపూడి అనుచరులు భవనం వద్దకు వచ్చిన అధికారులపై రాళ్లు రువ్వారు. ఇటుకలు విసిరి వీధి రౌడీల్లా ప్రవర్తించారు. రాళ్లు, ఇటుకలు విసరడంతో ఇద్దరు అధికారులు గాయపడ్డారు.