యూపీలోని హత్రాస్‌లో తొక్కిసలాట.. 107 మందికిపైగా మృతి
లక్నో జులై 02(ప్రజాక్షేత్రం): ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఘోరం జరిగింది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంగళవారం భారీ ఎత్తున తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 107 మంది చనిపోయారు. ఇందులో మహిళలే అధికంగా ఉన్నట్టు తెలుస్తున్నది. హత్రాస్ జిల్లాలోని రతిభాన్‌పూర్ గ్రామంలో ఒక మత ప్రచారకుడు భారీ టెంట్ల కింద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘోరం సంభవించింది. సత్సంగ్ కార్యక్రమానికి హాజరైన భక్తులు టెంట్ల కింద ఉక్కపోత, ఊపిరి ఆడకపోవడంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన క్రమంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నా.. అందుకు అనుగుణంగా టెంట్ లోపల తగిన ఏర్పాట్లు చేయలేదని తెలుస్తున్నది.
‘మత బోధకుడు భోలే బాబా ఏర్పాటు చేసిన సత్సంగ్ కార్యక్రమం ఇది. మంగళవారం మధ్యాహ్నం ఎటా, హత్రాస్ జిల్లాల సరిహద్దులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకునేందుకు తాత్కాలిక అనుమతి ఇచ్చాం’ అని అలీగఢ్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ షలాభ్ మాథుర్ చెప్పారు. కార్యక్రమం ముగిసే సమయంలో ఉక్కపోతను తట్టుకోలేక త్వరగా బయటకు వెళ్లిపోయేందుకు సభికులు ప్రయత్నించడంతో తొక్కిసలాట మొదలైందని ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక వ్యక్తి చెప్పారు. ‘ఆ సమావేశానికి పెద్ద సంఖ్యలో బాబా అనుచరులు వచ్చారు. బయటకు పోవడానికి దారులు లేకపోవడంతో ఒకరిపై ఒకరు పడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది’ అని ఆయన తెలిపారు. తాను బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. టెంట్ల బయట పెద్ద సంఖ్యలో మోటర్ సైకిళ్లు పార్క్ చేసి ఉన్నాయని చెప్పారు. చాలా మంది చనిపోయారని, అనేక మంది స్పృహ తప్పారని తెలిపారు. అయితే.. ఈ ఘటనకు అసలు కారణం ఏంటనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాలను ఎటా హాస్పిటల్‌కు తరలించినట్టు ఎటా ఎస్‌ఎస్‌పీ రాజేశ్‌కుమార్ సింగ్ తెలిపారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. ఆగ్రా జోన్ జిల్లా అదనపు కలెక్టర్, అలీగఢ్ పోలీస్ కమిషనర్‌లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాలను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.