Praja Kshetram
జాతీయం

విద్యారంగాన్ని రాష్ట్ర జాబితాలోకి చేర్చాలి.. నీట్‌ను రద్దు చేయడమే పరిష్కారం: తమిళ సినీ హీరో విజయ్‌

విద్యారంగాన్ని రాష్ట్ర జాబితాలోకి చేర్చాలి.. నీట్‌ను రద్దు చేయడమే పరిష్కారం: తమిళ సినీ హీరో విజయ్‌

 

 

చెన్నై జులై 03(ప్రజాక్షేత్రం): నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)ను రద్దు చేయాలని ప్రముఖ తమిళ సినీ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ డిమాండ్‌ చేశారు. ఇది తమిళనాడులో అనేక మంది అభిప్రాయమని చెప్పారు. 10, 12వ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించేందుకు చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్‌ మాట్లాడుతూ పరీక్షల వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘నీట్‌ పరీక్షపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. దేశానికి నీట్‌ అవసరం లేదు. నీట్‌ను ఉపసంహరించడమే ఏకైక పరిష్కారం’ అని విజయ్‌ నొక్కి చెప్పారు.నీట్‌ను ఉపసంహరించాలన్న తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి విజయ్‌ తన పూర్తి మద్దతు ప్రకటించారు. తమిళనాడు ప్రజల భావోద్వేగాలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘నీట్‌కు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజల మనోభావాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అన్నారు. విద్య అనేది ఉమ్మడి జాబితా నుంచి తప్పించి.. రాష్ట్ర జాబితాలోకి మార్చాలని విజయ్‌ డిమాండ్‌ చేశారు. గ్రామీణ విద్యార్థులపై నీట్‌ నష్టదాయ ప్రభావాన్ని చూపుతున్నదని విజయ్‌ అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యావ్యవస్థల మధ్య ఉన్న వైవిధ్యాన్ని బలంగా చూడాలేకానీ బలహీనతగా చూడరాదని చెప్పారు. ‘నీట్‌ వల్ల గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. వైవిధ్యం అనేది బలం. అదేమీ బలహీనత కాదు’ అని వ్యాఖ్యానించారు. విద్యార్థులు చురుకుగా, ఆశాభావంతో ఉండాలని విజయ్‌ సూచించారు. ‘దేనిలోనైనా ఓటమి ఎదురైతే నిరాశ చెందొద్దు. జీవితాలో ప్రతిసారీ మరో అవకాశం ఉంటూనే ఉంటుంది’ అని సలహా ఇచ్చారు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ఆశాభావంతో, పట్టుదలతో ప్రయత్నించాలని చెప్పారు.కేంద్ర ప్రభుత్వాన్ని సంబోధించే క్రమంలో విజయ్‌ ‘ఒండ్రియ అరసు’ అనే పదాన్ని విజయ్‌ ఉపయోగించడం గమనార్హం. ఈ పదాన్ని తమిళనాడులోని అధికార డీఎంకే, దాని మిత్రపక్షాలు తరచూ వాడుతుంటాయి. ఈ పదం వాడటం ద్వారా నీట్‌, విద్యారంగ స్వతంత్ర ప్రతిపత్తిపై డీఎంకే, దాని మిత్రపక్షాలకు తన మద్దతును విజయ్‌ ప్రకటించినట్టయింది. ఈ వేదిక ద్వారా తమిళనాడు విద్యార్థుల అవసరాల మేరకు విద్యారంగ సంస్కరణలకు విజయ్‌ పిలుపునివ్వడం విశేషం. నీట్‌పై, విద్య అంశంలో కేంద్రం ఆధిపత్యంపై చర్చ నేపథ్యంలో విజయ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Related posts