మల్కాజ్గిరి అభివృద్ధికి కృషి చేస్తా ఉపాధి, మౌలిక వసతులక కల్పనపై ఫోకస్ : ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్ జులై 07(ప్రజాక్షేత్రం): మల్కాజ్గిరి పార్లమెంటు నియోజవర్గం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆత్మీయ సన్మాన మహోత్సవంలో ఆయన మాట్లాడారు. నియోజవర్గంలో ఉపాధి, మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెడుతామన్నారు. ప్రభుత్వం అనేది డబ్బు, వ్యాపారం కోణంలో ఆలోచించవద్దని, ఎక్స్ప్రెస్ హైవేలు కడితే దాని కింద కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉన్నంతలో చిత్తశుద్ధితో మేలు చేసేందుకు ప్రయత్నించడం ద్వారా నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోవడానికి కృషి చేస్తానన్నారు. సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో ఒక్క సీటు కావాలని అడిగే స్థాయి నుంచి వేల సీట్లు ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు. మేము మామూలు వాళ్ళం కాదు కాబట్టే కేసీఆర్ లాంటి వాళ్లు అనేక ప్రలోభాలు పెట్టినప్పటికీ నిలబడ్డ వాళ్ళమన్నారు. ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్న జాతుల కోసం వారి సమస్యల కోసం కొట్లాడే బిడ్డగా ఉంటానని మీకు మాటిస్తున్నానన్నారు. నాకు ఉన్నంతలో అందరితో కలిసి నడిచే ప్రయత్నం చేస్తానని, మీ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తానని.. మీరు చూపుతున్న ప్రేమకి సన్మానానికి కృతజ్ఞుడిగా ఉంటానని హామీనిచ్చారు.