మాదిగల సంకల్ప బలానికి 30 ఏళ్ల ఎమ్మార్పీఎస్ ఉద్యమం నిదర్శనం..
-ఉద్యమానికి అండగా ఉన్న సమాజానికి రుణపడి ఉన్నాం.
-ఎస్సీ వర్గీకరణతో పాటు అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతాం.
-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ.
హైదరాబాద్ జులై 07(ప్రజాక్షేత్రం): ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముప్ఫై ఏళ్ళుగా నిలబడడానికి మాదిగల సంకల్పబలం, సమాజం అందించిన అండదండలే ప్రధాన కారణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గారు అన్నారు. ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అద్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేశారు, ఆ తరువాత అధునికరించబడిన ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తన పుట్టిన రోజు కేక్ ను కట్ చేయడం జరిగింది. అనంతరం నిర్వహించిన సభలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణ అనే ఆశయం గొప్పది కనుక సమాజం మొత్తం ఎమ్మార్పీఎస్ కు అండగా నిలబడిందని అన్నారు. మాదిగల కోసమే కాకుండా సమాజలోని అన్ని వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఎమ్మార్పీఎస్ ను తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే గుండె జబ్బుల చిన్నారుల కోసం, వికలాంగుల కోసం , వృద్దులు వితంతువులు కోసం అనాథ పిల్లల కోసం అలాగే బడుగు బలహీవర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆరోగ్య శ్రీ తో పాటు అనేక సంక్షేమ పథకాలు సాధించడం జరిగిందని అన్నారు.ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం అంతిమ దశలో ఉందని, ధర్మం గెలిచి మాదిగలు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్గీకరణకు అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు సమాజం ముందుకు వచ్చినప్పుడు యావత్తు సమాజం ధర్మాన్ని గుర్తించి మాదిగలకు అండగా నిలబడిందని అన్నారు. ఈ ముప్ఫై ఏళ్ల ఉద్యమ ప్రస్థానం అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే సాధ్యమైందని అన్నారు. అందువల్ల సమాజానికి ఋణపడి ఉన్నామని అన్నారు. పాలకులు ఎన్నో కుట్రలు చేసి ఉద్యమం నిర్వీర్యం చేయాలని నేటికీ చూస్తున్నప్పటికి మాదిగలు చెక్కు చెదరకుండా నిలబడ్డారని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సుధీర్ఘ కాలంగా నడుస్తున్న ఏకైక ఉద్యమంగా ఎమ్మార్పీఎస్ నిలుస్తుందని అన్నారు. భవిష్యత్లో ఎస్సీ వర్గీకరణ సాధనతో పాటు అణగారిన వర్గాల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమాల కొనసాగిస్తామని అన్నారు. ముఫ్ఫై ఏళ్ల ఉద్యమంలో సైనికుల వలె పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు రావెల కిషోర్ బాబు, మాజీ ఎంపి బి. వెంకటేష్ నేత, ప్రముఖ బిసి నేత కందుకూరు జగదీశ్వర్ రావు,ఎం ఎస్ పి జాతీయ నాయకులు రాగాటి సత్యం మాదిగ, తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.