పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి లను ప్రశ్నించిన కేటీఆర్.
న్యూఢిల్లీ జులై 09(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో రాహుల్ గాంధీ వ్యవహారిస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావులతో కలిసి ఢిల్లీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అంటూ మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని చంపేలా ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు.రాహుల్ గాంధీ తీరును దేశ ప్రజలకు తెలియజెప్పేందుకే ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతున్నామని పాంచ్ న్యాయ్‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేస్తామన్న రాహుల్ తుక్కుగూడ సభలో పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వం పోయేలా చేస్తామని చెప్పారు, కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. ఇదే రాహుల్ గాంధీ గోవాలో కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ మారవద్దని వారితో ప్రమాణం చేయించారు. కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరుగుతున్నారు. ఏఐసీసీ అనుమతి తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపిస్తున్నారు. దీనిపై రాహుల్ గాంధీ ఏం సమాధానం చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక పార్టీ లో గెలిచి మరొక పార్టీలోకి మారితే రాళ్లతో కొట్టి చంపాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే వ్యాఖ్యనించారని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ మారిన వారిని పిచ్చి కుక్కలుగా భావించాలన్నారన్నారు. మరి ఇప్పుడు ఎవరినీ రాళ్లతో కొట్టి చంపాలో? ఎవరు పిచ్చికుక్కో రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఆరుగురు ఎమ్మెల్యేలను, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి లాగారని కేటీఆర్ రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు.గతంలో మణిపూర్ లో ఓ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ పై విచారణ ద్వారానే సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఫిరాయింపులపై పోరాటమంటూనే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ఎందుకు పాల్పడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేసిందని సిద్దిరామయ్య ఆరోపించారని గుర్తు చేశారు. మరి తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోళ్లకు ఎంత ఖర్చు చేస్తున్నారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో న్యాయం కోసం ఢిల్లీలో నాలుగు రోజులుగా న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ గుర్తు పై గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బీ ఫామ్ పై పోటీ చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంత బహిరంగంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు లో పిటిషన్ వేశామని కేటీఆర్ గుర్తు చేశారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కు సంబంధించి రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. లోక్ సభ స్పీకర్, రాజ్య సభ ఛైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనేత్తుతామని…అవకాశం ఉన్న అన్ని వేదికల్లో న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ బాధిత పార్టీలతో కలిసి భవిష్యత్ లో పార్టీ ఫిరాయింపుల చట్టం బలోపేతం చేసేందుకు పోరాటం చేస్తామన్నారు. పాంచ్ న్యాయ్ లో కాంగ్రెస్ చెప్పిన విధంగా పార్టీ మారగానే సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తేవాలని కేటీఆర్ కోరారు.