పీర్జాదిగూడ మున్సిపాల్టీలో కాంగ్రెస్‌లోకి 15మంది కార్పొరేటర్లు.
హైదరాబాద్ జులై 10(ప్రజాక్షేత్రం): మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. తన నియోజకవర్గం పరిధిలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో 15 మంది బీఆరెస్ కార్పొరేటర్లు పార్టీకి గుడ్‌బై కొట్టి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తాజా పరిణామంతో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. కాంగ్రెస్‌లో చేరిన 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు. మొన్న జవహర్ నగర్, నిన్న బోడుప్పల్ కాంగ్రెస్ కైసవం అయ్యాయి. అదే బాటలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా హస్తగతం కానుంది. మరోవైపు పార్టీ మారుతున్న కార్పొరేటర్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి నిలువరించలేకపోయారు. వారిని అడ్డుకోలేక చేతులెత్తేశారు. ఈ వ్యవహారంలోనే మంగళవారం జరిగిన ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్‌లో రసాభాస చోటు చేసుకుంది. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని.. బలవంతంగా, బెదిరింపులకు పాల్పడి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారంటూ బీఆరెస్ నేతలు ఆరోపించారు. అయితే మల్లారెడ్డినే కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, ఆయనే వెనుకుండి బీఆరెస్ కార్పోరేటర్లను కాంగ్రెస్‌లోకి పంపించారన్న ప్రచారం సైతం బలంగా వినిపిస్తుంది.