2వేల కోట్లతో జంటనగరాల్లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ : ఎంపీ ఈటల.
-ప్రధాని మోదీ చొరవతో రైల్వే సేవల విస్తరణ.
-రైల్వే మంత్రికి మల్కాజ్‌గిరి రైల్వే సమస్యలపై వినతి.
-మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడి.
హైదరాబాద్ జులై 11(ప్రజాక్షేత్రం): దేశంలో రైల్వే వసతుల విస్తరణ..అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యతనిస్తున్నారని, 2వేల కోట్లతో జంటనగరాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కోన్నారు. గురువారం మేడ్చల్ రైల్వే స్టేషన్, ఆర్‌యూబీ పనులను పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ కంటే ముందు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి జరగలేదన్నారు. ప్రధాని మోదీ చొరరవతో జంటనగరాల్లో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలను తలపిచేలా ఆధునీకరించే పనులు చేపట్టారని, మేడ్చల్‌లో కూడా 32కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
గౌడవెల్లి, గుండ్ల పోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడల రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మెట్రో రైలు మాదిరిగా ఎంఎంటీఎస్‌లకు కూడా దగ్గర దగ్గర స్టేషన్లు ఏర్పాటు చేయమని ఇక్కడి ప్రజలు కోరుతున్నారని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో రైల్వే సమస్యల సాధనకు కేంద్ర రైల్వే మంత్రితో కలవడం జరిగిందన్నారు. వెంటనే సికింద్రాబాద్‌లో ఉన్న ఉన్నతాధికారులను పంపించారని, క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని సూచించారని ఈటల వెల్లడించారు. అధికారులతో కలిసి మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని రైల్వేస్టేషన్లను, ఆర్‌యూబీలను పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రపోజల్స్ అన్నీ ఢిల్లీ తీసుకుపోయి..రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అతి తొందరలో వీటన్నింటిని పరిష్కారం చేస్తామన్నారు.
బొల్లారం, వినాయకనగర్ గేట్ల వద్ద రెండు గంటలు పడుతుందని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారని, అమ్మగూడెం అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రజలు వివరించారన్నారు. మరో 20 సంవత్సరాలు ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని అండర్ పాస్ లను అభివృద్ధి చేస్తామని ఈటల తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని రైలు నిలయం, రైల్వే ఆస్తులు, చర్లపల్లి టెర్మినల్, అనేక రైల్వే లైన్లు ఉన్నాయని, వాటిన్నింటిని పరిశీలించి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో చూసి నిర్ణయం తీసుకుంటామని ఈటల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సీపీఎం జీఎస్ ఏకే సింగ్, సీనియర్ డీ.ఈ.ఎన్ కోఆర్డినేషన్ ఏ. ముత్యాల నాయుడు., అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ హైదరాబాద్. ఏ గోవిందరావు, మేడ్చల్ స్టేషన్ సుపరింటెండెంట్ లక్ష్మీ నారాయణ గారు, బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.