బడ్జెట్ సమావేశాల్లో ఎలా వ్యవహరిద్దాం.. అసెంబ్లీలో బీజేఎల్పీ భేటీ.
హైదరాబాద్ జులై 12(ప్రజాక్షేత్రం): అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఎలా ఇరుకున పెట్టాలనే అంశంతోపాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్‌పై ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. రైతు రుణమాఫీ, పంట పెట్టుబడిసాయం, నిరుద్యోగులపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే అంశాలపై ఎమ్మెల్యేలు చర్చిస్తున్నారు. మరోవైపు నేడు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరుగనుంది. శంషాబాద్ మల్లిక కన్వెన్షన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జులు సునీల్ బన్సల్, తరుణ్‌ఛుగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పదాధికారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.