బీజేపీని ఆదరించిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్: కిషన్ రెడ్డి.
-వచ్చే ఎన్నికల్లో అధికారం తథ్యం.
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి.
హైదరాబాద్ జులై 12(ప్రజాక్షేత్రం): అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఏనిమిదేసి స్థానాల చొప్పున గెలిపించిన తెలంగాణ ప్రజలకు పార్టీ సెల్యూట్ చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ మల్లికా కన్వేన్షన్‌లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం14నుంచి 35శాతం వరకు గణనీయంగా పెరిగిందని, 8ఎంపీ స్థానాల్లో గెలవడంతో పాటు మరో ఏడు స్థానాల్లో బీజేపీని రెండో స్థానంలో నిలిపారన్నారు.
నిజానికి బీజేపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచేదని, కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు, రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజ్వేషన్లు రద్దు చేస్తారన్న తప్పుడు ప్రచారంతో కొన్ని సీట్లు గెలుచుకోలిగిందన్నారు. కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినప్పటికి బీజేపీ అసాధారణ విజయాలు సాధించడం విశేషమన్నారు. కాంగ్రెస్, బీఆరెస్‌లు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ విజయాలను అడ్డుకోలేకపోయారన్నారు. ప్రజలు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరును, దేశ భద్రత, జాతీయ అంశాల ప్రాతిపదిక ఓటింగ్ చేశారన్నారు. ముఖ్యంగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు.
అక్కడ మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి పట్టం కట్టారని గుర్తు చేశారు… రేవంత్ సొంత ఉమ్మడి జిల్లా అయిన మహబూబ్ నగర్‌లోనూ కమలం వికసించడం, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఆనందదాయకమని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పదేళ్లు అధికారం వెలగబెట్టిన బీఆరెస్ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు గెలవలేక చతికిలబడిందని ఎద్దేవా చేశారు. మొత్తం 44 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో ఉన్నారని తెలిపారు. ఈ పరిణామం రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు శుభ సూచికమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బీఆరెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆదరిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందని, ఆ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి. ఎనిమిది నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ వెళ్తాందని, పాలనలో పార్టీ వ్యవహారాల్లో గాంధీభవన్‌కు, తెలంగాణ భవన్‌కు తేడా లేకుండాపోయిందని విమర్శించారు.