గుంతలమయంగా రహదారి.
చెన్నూరు జూలై 13(ప్రజాక్షేత్రం): చెన్నూరు – మంచిర్యాల ప్రధాన రహదారిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు జంకుతున్నారు. అడుగుకో గుంతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి 63 జోడు వాగుల వంతెన వద్ద దాదాపు కిలోమీటరు మేర రహదారి గుంతలమయంగా మారింది. కురుస్తున్న వర్షాల వల్ల బీటీ రోడ్డు కిలోమీటరు మేర అధ్వానంగా తయారైంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలుపుతూ చేపట్టిన నిజామాబాద్- జగ్దల్పూర్ 63 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చెన్నూరు- భీమారం జోడు వాగుల ప్రాంతంలో రిజర్వు ఫారెస్టు ఉంది. ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కేంద్రం నుంచి అటవీ శాఖ అనుమతులు లభించక పోవడంతో రహదారి నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. వర్షాలు కురుస్తుండడంతో రహదారిపై ఉన్న తారు లేచిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఎదురెదురు గా వాహనాలు వచ్చినప్పుడు వెళ్లలేని పరిస్థితులున్నాయి. భారీ వాహ నాలు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను తప్పించే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు వాపోతున్నారు. మంచిర్యాల నుంచి జోడు వాగుల వరకు ప్రయాణం సాఫీగా సాగగా మిగితాది మరో ఎత్తుగా మారిందని వాహనదారులు పేర్కొం టున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కిలోమీటరు మేర దెబ్బతిన్న రహదారికి మరమ్మతు చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు.