Praja Kshetram
తెలంగాణ

ఉజ్జయిని మహంకాళీ బోనాలకు ఘనంగా ఏర్పాట్లు … మాజీ మంత్రి తలసాని సమీక్ష.

ఉజ్జయిని మహంకాళీ బోనాలకు ఘనంగా ఏర్పాట్లు … మాజీ మంత్రి తలసాని సమీక్ష.

 

 

 

హైదరాబాద్ జులై 13(ప్రజాక్షేత్రం): ఈ నెల 21 వ తేదీన జరిగే సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుందామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాలలో పర్యటించి 21 వ తేదీన జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల సందర్బంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుండి లక్షలాదిమంది భక్తులు వస్తారని, వారు ఎలాంటి అసౌకర్యానికి, ఇబ్బందులకు గురికాకుండా శాఖల మద్య సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 22 వ తేదీన రంగం (భవిష్యవాణి), అంబారీ పై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి దర్శనం సందర్బంగా క్యూ లైన్ లలో ఎలాంటి తోపులాటకు ఆవకాశం లేకుండా పటిష్టమైన బారికేడ్ లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా భక్తులకు త్రాగునీటిని అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందని చెప్పారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగనిరీతిలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. బోనాల ఉత్సవాలలో భక్తులకు సేవలు అందించే వాలంటీర్ లకు ఫోటోతో కూడిన ప్రత్యేక పాస్ లను జారీ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం అదనపు పోలీసు సిబ్బంది నియామకంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. అదేవిధంగా బోనాల రోజున వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో అందరి భాగస్వామ్యంతో బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీసీC సమ్మయ్య, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ అశోక్, ఏసీపీ సర్దార్ సింగ్, సీఐ పరశురాం, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, శానిటేషన్ డీఈ శ్రీనివాస్, క్రిస్టోఫర్, అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, చైర్మన్ కామేశ్వర్ రావు, దక్కన్ సేవా సమితి అధ్యక్షుడు ధర్మవీర్, కార్పొరేటర్ టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కిరణ్మయి, బీఆరెస్‌ పార్టీ నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేశన్ రాజు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Related posts