Praja Kshetram
తెలంగాణ

‘ప్రాణహిత-చేవెళ్ల ’ పై చిగురిస్తున్న ఆశలు

‘ప్రాణహిత-చేవెళ్ల ’ పై చిగురిస్తున్న ఆశలు

 

 

మంచిర్యాల జూలై 13(ప్రజాక్షేత్రం): ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలకు సాగు నీరందించే ఉద్దేశ్యంతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపకల్పన చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మంచి రోజులు రానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసినట్లయింది. ఈ మేరకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని కాంగ్రెస్‌ ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రాణహితను విస్మరించింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన క్యాంపులను ఎత్తివేయగా, టన్నెల్‌ భారీ ఇనుప పైపులను కూడా కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ వెనక్కి తీసుకెళ్లింది. నెన్నెల మండలం మైలారం వద్ద ఏర్పాటు చేసిన భారీ పైపుల నిర్మాణ కేంద్రాన్ని, కాంక్రీటు మిక్చర్‌ ప్లాంటును కూడా తరలించుకుపోయారు. దీంతో ఏళ్లుగా సాగునీటిపై అన్నదాతలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.

*16.4 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా..*

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించింది. రూ.38,500 కోట్ల అంచనాతో 160 టీఎంసీల సామర్థ్యంతో 2008లో అప్పటి ప్రభుత్వం పథకానికి శ్రీకారం చుట్టింది. ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి టన్నెళ్లు, లిఫ్టులు, రిజర్వాయర్లు, డిస్టిబ్యూటరీల ద్వారా నీటిని తరలించాలని ప్రతిపాదించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్‌ నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లో 56,800 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక తయారు చేశారు. పనులకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను 28 ప్యాకేజీలుగా విభజించి వివిధ కాంట్రాక్టింగ్‌ కంపెనీలకు అప్పగించారు. మంచిర్యాల జిల్లాలో ఐదు ప్యాకేజీల్లో కాలువల నిర్మాణం చేపట్టవలసి ఉంది. ఒకటో ప్యాకేజీలో కౌటాల మండలం రణవెల్లి నుంచి ప్రారంభమైన కాలువ నిర్మాణం బెజ్జూర్‌ మండలం కర్జెల్లి దాటింది. దహెగాం, నెన్నెల మండలంలో పనులు చేపట్టారు. నెన్నెల మండలం మైలారం వద్ద టన్నెల్‌ నిర్మాణ పనులు చేపట్టారు. భారీ ఇనుప పైపులతో ఐదు కిలోమీటర్ల మేర పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. 5 ప్యాకేజీల ద్వారా చేపట్టిన పనుల్లో భూములు కోల్పోయిన వారికి 75 శాతం వరకు పరిహారం కూడా అందింది.

*గత ప్రభుత్వ వైఖరితో..*

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన సామగ్రి వెనక్కి మళ్లడంతో భారీ మొత్తంలో నిధులు వృథా అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని భూముల ముంపు వంకతో తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా దిగువన ఉన్న కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించారు. ఓ వైపు పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాకు అన్యాయం జరగదని అంటూనే కాళేశ్వరం పనులు పూర్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం వందల కోట్లతో చేపట్టిన పనులను గుత్తేదార్లు అర్ధంతరంగా వదిలివేశారు. 71 కిలోమీటర్ల మేర కాలువలు నిర్మించాల్సి ఉండగా 30 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వి పనులను మధ్యలో వదిలేశారు. రెండు జిల్లాల పరిధిలోని కర్జెల్లి, సల్గుపల్లి, జిల్లెడ, కర్జి, జంగాల్‌పేట, కుశ్నపల్లి, మైలారం, దుబ్బపల్లి, తదితర ప్రాంతాల్లో చేపట్టిన పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రాజెక్టుకు పునర్జీవనం పోస్తే రూ.639 కోట్లతో ఇప్పటివరకు నిర్మించిన కాలువలు ఇతర పనులు తిరిగి ఉప యోగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు కావడం, పెద్దగా విద్యుత్‌ బిల్లులు చెల్లించే అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించే అవకాశం ఉండడంతో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత-చేవేళ్ల వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.

Related posts