రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.
-మద్యం మత్తులో కారు డ్రైవర్.
-ఈ ప్రమాదానికి అతివేగంమే కారణం.
-ఇద్దరు అక్కడికక్కడే మృతి.
-మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు.
-ఒక విద్యార్థి పరిస్థితి విషమం.
నిజామాబాద్ జిల్లా జులై 14 (ప్రజాక్షేత్రం):మాక్లూర్ మండల కేంద్రంలోని దాస్ నగర్ వెళ్లే మార్గంలో తప్ప తాగి అతివేగంగా కారు నడుపుతూ నడుచుకుంటూ వెళ్తున్న వారిని కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన చోటుచేసుకుంది. మృతుల్లో పద్మ (35), పోచవ్వ (64) అక్కడికక్కడే మృతి చెందారు. మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రిషికా, ఇంటర్మీడియట్ విద్యార్థినిలకు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో రిషికా పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళితే మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను రెండవ ఆదివారం తల్లిదండ్రులు చూడడానికి వస్తారు. ఈ క్రమంలో వారిని అవుటింగ్ తీసుకువెళ్లి తినిపించి తిరిగి పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు నడుపుతున్న సతీష్ నిజామాబాద్ ఆర్టీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్న సతీష్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. సంఘటన స్థలాన్ని సీఐ సుదీర్ రావు తో పాటు ఎస్ఐ సతీష్ పరిశీలించారు. అదే సమయంలో నిజామాబాద్ రూరల్ సీఐ మహేష్, నవిపేట ఎస్సై యాదగిరి గౌడ్ లు సంఘటన స్థలంలో ఉన్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను స్థానికులు దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.