కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
హైదరాబాద్ జులై 15(ప్రజాక్షేత్రం): బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి వలస కడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్‌లో చేరినట్లు మహిపాల్ రెడ్డి తెలిపారు. మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ చేరారు. మహిపాల్‌రెడ్డి 2014 నుంచి పటాన్‌చెర్‌లో వరుసగా మూడుసార్లు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అనుచరులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత కొద్దిరోజులుగా మహిపాల్ రెడ్డి చేరిక వాయిదా పడుతూ వస్తోంది. రెండు రోజుల క్రితం ఆయన చేరాల్సి ఉన్నా పార్టీ నేతల అభ్యంతరంతో వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మహిపాల్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు త్వరలో హస్తం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
