Praja Kshetram
తెలంగాణ

కేజీబీవీల్లో బోధన మెరుగుపడేనా?

కేజీబీవీల్లో బోధన మెరుగుపడేనా?

 

-బోధన మెరుగుపడేనా?

-రెండేళ్లుగా ఇంటర్‌ విద్య అమలు.

-ఇంతవరకూ భర్తీకాని లెక్చరర్‌ పోస్టులు.

-గెస్ట్‌ ఫ్యాకల్టీలతో సరి.

-నిరాశలో తల్లిదండ్రులు.

రాజాం, జూలై 15: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్‌ విద్య నేటికీ గాడిన పడలేదు. ఇంటర్‌ విద్య ప్రారంభించి ఆరేళ్లయినా లెక్చరర్‌ పోస్టుల భర్తీని చేపట్టలేదు. గెస్ట్‌ ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నారు. ఎంతో ఆశయంతో ప్రారంభించిన ఈ విద్యాలయాలను గత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. డ్రాపౌట్స్‌ నియంత్రణతో పాటు ఉపాధి కోసం వలసపోయిన లేక పేద తల్లిదండ్రుల పిల్లల కోసం 15 సంవత్సరాల కిందట కేజీబీవీ బాలిక విద్యాలయాలను ఏర్పాటుచేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో వీటిని ప్రారంభించారు. ఆరు నుంచి పదో తరగతి వరకూ బాలికలకు వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. ప్రతీ పాఠశాలలలో 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే పదో తరగతి తరువాత కూడా ఎక్కువ మంది డ్రాపౌట్స్‌ ఉండడంతో వారి కోసం రెండేళ్ల కిందట కేజీబీవీలను కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. జిల్లాలో 19 కేజీబీవీల్ల్లో 2018లో ఇంటర్‌ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులను ప్రవేశపెట్టారు. 2021లో అన్ని విద్యాలయాల్లోనూ ఇంటర్‌ విద్యను అమలు చేశారు. అంతకుముందు కంప్యుటర్‌ సైన్స్‌, అకౌంట్‌ టాక్సెసన్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, యానిమేషన్‌, ఫిజియోథెరపీ, సెరీకల్చర్‌ కోర్సులను ఐదేళ్ల కిందట ప్రారంభించారు. వేటికీ రెగ్యులర్‌ అధ్యాపకులను నియమించలేదు. వైసీపీ ప్రభుత్వం గెస్ట్‌ లెక్చరర్లను నియమించి చేతలు దులుపుకుంది. దీంతో విద్యాబోధన అంతంతమాత్రంగా సాగుతోంది. ప్రస్తుతం ఒక్కో కేజీబీవీలో ఏడుగురు సీఆర్‌టీలతో పాటు ఒక ప్రత్యేకాధికారి విధులు నిర్వహిస్తున్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకూ 200 మంది విద్యార్థులకు వీరే బోధిస్తుంటారు. వసతిగృహ పర్యవేక్షణ బాధ్యతలు కూడా వీరివే. ప్రభుత్వం కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసినా వసతులు మత్రం మెరుగుపరచలేదు. గత ఏడాది కొంతమంది గెస్ట్‌ లెక్చరర్లను నియమించారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌, సెరీకల్చర్‌, టాక్సెషన్‌, గ్రాఫిక్‌ యానిమేషన్‌ కోర్సులకు సంబంధించి నిపుణులను నియమించలేదు. దీనికితోడు గత ఏడాది గెస్ట్‌ లెచ్చరర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది రిటైర్డ్‌ అధ్యాపకులను, ఉపాధ్యాయులను గెస్ట్‌ లెక్చరర్లుగా నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. పరీక్షలకు ఇంకా ఐదు నెలల వ్యవధే ఉంది. దీంతో తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు.

*అక్రమాలపై ఫిర్యాదులు.*

కేజీబీవీల్లో సిబ్బంది తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా నిధులు పక్కదారి పడుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆహార పదార్థాలు, నిత్యావసరాల కొనుగోలులో కొందరు ప్రత్యేకాధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్వీపర్లు, వంటపనివారు వంటి బోధనేతర సిబ్బంది నియామకాల్లో సైతం భారీగా డబ్బులు డిమాండ్‌ చేసినట్టు కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. గత ఏడాది చాలా కేజీబీవీల్లో దిగువస్థాయి సిబ్బందిని నియమించారు. సంవత్సరం గడవకముందే కొందర్ని తొలగించారు. ఇదేమని ప్రశ్నిస్తే డబ్బులిస్తే కొనసాగిస్తామంటు న్నారని బాధితులు వాపోతున్నారు. ఈ సమస్యను సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు.

Related posts