Praja Kshetram
తెలంగాణ

రూ. 2 ల‌క్ష‌లు దాటినా రుణాల‌కు.. అప్పు క‌ట్టేందుకు అప్పు తెచ్చుకో అన్న‌ట్లుంది : హ‌రీశ్‌రావు.

రూ. 2 ల‌క్ష‌లు దాటినా రుణాల‌కు.. అప్పు క‌ట్టేందుకు అప్పు తెచ్చుకో అన్న‌ట్లుంది : హ‌రీశ్‌రావు.

 

 

హైద‌రాబాద్ జులై 16(ప్రజాక్షేత్రం): కాంగ్రెస్ ప్ర‌భుత్వం జారీ చేసిన పంటల రుణ‌మాఫీ మార్గ‌ద‌ర్శ‌కాల‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రెండు లక్షలకు పైగా అప్పున్న రైతులు, ఆ అప్పును కడితేనే రుణమాఫీ చేస్తం అంటున్నారు. అంటే అప్పు మాఫీ కోసం బయట మూడు రూపాయలకు మళ్లా అప్పు తెచ్చుకునే పరిస్థితి. అప్పు కట్టేందుకు అప్పు తెచ్చుకో అన్నట్లుంది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతుకు అప్పు ఎప్పుడు పుట్టాలి..? ఎప్పుడు కట్టాలి..? ఎప్పుడు మీరు జ‌మ చేయాలి..? ఎంత ఆలస్యం జరుగుతుందో తెలుసా..? ఇలాంటి షరతులు అవసరం లేదు. మీరు ఇచ్చే రెండు లక్షల రుణమాఫీ చేయాలి. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందనడం దారుణం. అంటే దీర్గకాలిక పంటలకు లేదన్నట్లు.. బ‌త్తాయి తోట, మామిడి తోట, ఫాం ఆయిల్ ఇలాంటి పంటలకు రుణమాఫీ లేదు. అంటే దాదాపు పది లక్షల ఎకరాలకు రుణమాఫీ లేనట్టే అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రీషెడ్యూల్ చేసుకున్న వారికి రుణాలు వర్తించవు అన్నారు. తీవ్రంగా రైతులు నష్టపోయినప్పుడు, కరువు పరిస్థితులు ఉన్నపుడు, వరదలు వచ్చి పంట పొలాలు కొట్టుకుపోయినప్పుడు రీషెడ్యుల్ చేస్తారు. నిజానికి వారే ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవారు. వారికి రుణమాఫీ లేదని చెప్పడం దుర్మార్గం. సకాలంలో తీసుకున్న అప్పులు కట్టిన వారికి మొండి చేయి చూపడం సరికాదు. దీన్ని కూడా ఆలోచించాలి. రైతును సానుభూతితో చూడాలి. రుణమాఫీ వారికి కూడా చేయాలని కోరుతున్నాం అని హ‌రీశ్‌రావు చెప్పారు. రుణమాఫీ అమలుకు స్టార్టింగ్ డేట్ ఉండదు.. ఎండింగ్ డేట్ ఉంటుంది. మేము అలాగే చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటున్నారు. ఇలా కొందరు రైతులకు కోత పెట్టినట్లే కదా. ఇది తీవ్రమైన అన్యాయం. అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు మాఫీ చేస్తం అన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తం అన్నారు. కానీ, 8 నెలల కాలానికి వడ్డీ ఎవరు భరించాలి. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రుణమాఫీ చేయాలి. అమలు చేసే దాకా అయ్యే వడ్డీని కూడా ప్రభుత్వమే భరించాలి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు ప్రామాణికం కాదు అన్నారు. నాలుగు రోజుల తర్వాత రేషన్ కార్డే ప్రామాణికం అంటున్నారు. ఎన్నికల ముందు వడ్లకు బోనస్ ఇస్తాం అన్నారు. ఎన్నికల తర్వాత సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.. పది శాతం సన్నాలకు ఇచ్చి, 90శాతం రైతులకు పంగనామాలు పెడుతున్నరు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

Related posts