విద్యుత్ కోతలు భరించలేక.. సబ్ స్టేషన్ ముట్టడించిన ఊర్కొండపేట రైతులు.
మహబూబ్‌నగర్ జులై 18 (ప్రజాక్షేత్రం): జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని జాకినాలపల్లి సబ్ స్టేషన్ ముందు ఊర్కొండపేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏడిఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఊర్కొండపేట గ్రామంలో నిరాంతరాయంగా విద్యుత్ కోతలు ఉన్నాయి. అధికారులను సంప్రదిస్తే.. చిన్నచిన్న కారణాలు సాకు చూపుతూ గంటల తరబడి.. అంటే దాదాపు ఏడు నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కరెంట్ కోతల వల్ల రైతులతో పాటు పాడి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరెంట్ సమస్యలపై అధికారులకు ఫోన్లు చేస్తే కనీసం స్పందించడం లేదు. లైన్‌మెన్లు కూడా స్పందించడం లేదు. వర్షాలు సరిగా లేక కరెంట్ అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున సబ్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యుత్ కోతలను నియంత్రించి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారులు నిర్లక్ష్యం వీడి సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.