రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
— శాంతిభద్రతలు నిర్వీర్యం
— హత్యలు, దాడులతో అట్టుడుకుతున్న ఏపీ
విశాఖపట్నం జూలై 18(ప్రజాక్షేత్రం): రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రజలు స్వేచ్ఛగా రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా వైసిపి కార్యకర్తలు, నాయకులపై కూటమి శ్రేణులు చేస్తున్న దమనకాండ రోజురోజుకు మితిమీరిపోతుంది. దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి దిగజారి పోయిందని రాష్ట్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విధ్వంసాలను సృష్టిస్తోందని అన్నారు. వైసిపి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని కాదని, అంతకన్నా ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తాం అన్న కూటమి మాటలు నమ్మి, ప్రజలు అధికారాన్ని ఇస్తే.. గడచిన 45 రోజుల్లో 1000 కి పైగా దాడులు జరిగాయి. 31 మంది ప్రాణాలు బలిగొన్నారు. 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 300 మందిపై హత్యాయత్నాలకు పాల్పడ్డారు. 400 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. 500 పైగా ప్రైవేట్ ఆస్తులపై దాడులకు దిగారు. అలాగే ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ప్రేరేపించిందని మాజీ మంత్రి అమర్నాథ్ వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై నమ్మకం జనం కోల్పోయారని ఆయన అన్నారు.
వినుకొండలో పోలీసులు, ప్రజలు సాక్షిగా తమ పార్టీకి చెందిన మైనార్టీ యువజన నాయకుడిని నిర్ధాక్షిణ్యంగా రెండు చేతులు నరికి హతమార్చారని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ మిధున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్పను కలిసేందుకు వెళితే కూటమి మూకలు వారిపై దారుణంగా దాడులు చేశారని, భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం పక్కనపెట్టి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు ఈ దురాగతాలను బట్టి అర్థమవుతోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఈ దాడులను ప్రోత్సహించటం దురదృష్టకరమని అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయాలనుకుంటున్నారు. దానికన్నా ముందు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర సంఘటనలపై శ్వేత పత్రం విడుదల చేయాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక ఇండిపెండెంట్ సంస్థతో ఏపీలో జరుగుతున్న ఘటనలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వినుకొండలో జరిగిన ఘటనలో మరణించిన వైసిపి మైనార్టీ యువజన నాయకుడి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శిస్తారని అమర్నాథ్ తెలియజేశారు.
ఇదిలా ఉండగా విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు అంశంపై అమర్నాథ్ మాట్లాడుతూ చారిత్రక, పురావస్తు ఆధారాలతో కూడిన ఈ ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో అనుమతులు లేకుండా రోడ్ల నిర్మాణం, భూమిని చదును చేయడం, మట్టిని తరలించడం వంటి పనులను వెంటనే నిలిపివేయాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. సి.ఆర్.జెడ్ నిబంధనలను విరుద్ధంగా ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఎర్రమట్టిదిబ్బల వద్ద చాలాకాలంగా పనులు జరుగుతున్నాయని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులైనా ఇంకా అక్కడ పనులు ఎందుకు జరుగుతున్నాయని అమర్నాథ్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులను ఎందుకు నిలిపివేయలేదని అమర్నాథ్ ప్రశ్నించారు. ఎర్రబట్టిదిబ్బల పరిరక్షణకు అవసరమైతే ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.