బౌద్ధాన్ని బోధిస్తూ సంచారం చేసే భిక్షువులు.. ఆ మూడు నెలలు ఒకే చోట ఎందుకు ఉంటారో తెలుసా?
హైదరాబాద్ జులై 19(ప్రజాక్షేత్రం): బౌద్ధ భిక్షువుల జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రత్యేకించి పవిత్రమైన వస్స ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు ఎంతో విశిష్ఠమైనది. సాధారణంగా బౌద్ధాన్ని బోధిస్తూ సంచారం చేస్తూ ఉండే బౌద్ధ భిక్షువులు.. ఈ సమయంలో మాత్రం సుమారు మూడు నెలలు ఒకే చోట ఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ మూడు నెలల వస్స కాలం జూలై 21 నుంచి ఆషాఢ పూర్ణిమతో మొదలైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన బౌద్ధ భిక్షువులు మహాబోధి ఆలయంలో, వివిధ బౌద్ధారామాల్లో తమ ప్రత్యేక పూజాకాలాన్ని ప్రారంభించారు. రానున్న మూడు నెలలపాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి.
ఈ పవిత్ర కాలంలో భిక్షువులు ఒకే ప్రాంతంలో ఉండిపోతారు. అక్కడే ఉండి బుద్ధుని బోధనల గురించి వివరిస్తారు. సమాజం మంచిగా ఉండాలని ప్రార్థిస్తారు. వస్సను పాటించడం బుద్ధ భగవానుడి సూత్రాలైన కరుణ, నైతికత, త్యజించడం వంటి వాటికి అనుగుణంగా ఉంటుంది.
వర్షాకాలంలో పాములు, తేళ్లు వంటి చిన్నచిన్న జీవులు తమ ఆవాసాల నుంచి బయటకు వస్తాయి. బౌద్ధ భిక్షువులు పాదరక్షలు లేకుండా నడుస్తారు కాబట్టి వారికి అపాయం కలిగే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించేందుకే బౌద్ధ భిక్షువులు మూడు నెలల పాటు వర్షాకాలం ముగిసేంత వరకూ ఒకే ప్రాంతంలో ఉండి ధ్యానం చేసుకుంటూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెబుతుంటారు. ఈ క్రతువులో పాల్గొనేందుకు ఇతర దేశాలకు చెందిన భౌద్ధ భిక్షువులు సైతం ఈ సమయంలో భారతదేశానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
బౌద్ధులకు వస్స సంప్రదాయం ఎంత ముఖ్యమైనదో అఖిల భారత భిక్షు సంఘ కార్యదర్శి భిక్షి ప్రజ్ఞ దీప్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఈ పద్ధతిని స్వయానా బుద్ధ భగవానుడే ప్రారంభించారని తెలిపారు. కొంతమంది భక్తులు బుద్ధ భగవానుడి వద్దకు వెళ్లినప్పుడు మూడు నెలలపాటు నా బోధనలను అనుసరిస్తూ జ్ఞానాన్ని పొందాలని సూచించారని చెప్పారు. అందుకే భిక్షువులు ఆషాఢ పూర్ణిమ నుంచి అశ్విని పూర్ణిమ వరకూ వివిధ మఠాల్లో ఉంటారని తెలిపారు. వస్స కాలం పూర్తయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వివిధ బౌద్ధ ఆశ్రమాల్లో కఠిన చీవర దాన మొదలవుతుంది. ఈ పవిత్ర సమయంలో బుద్ధ గయను వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించుకుంటారు. చీవర దాన ఉత్సవాన్ని అత్యంత పవిత్రమైనదిగా బౌద్ధ సమాజం భావిస్తుంది.