Praja Kshetram
పాలిటిక్స్

ఉప ఎన్నికలపై బీజేపీ నజర్‌!

ఉప ఎన్నికలపై బీజేపీ నజర్‌!

-ఐదారుగురు బలమైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్‌

-పార్టీ అధిష్ఠానం ముందు ప్రతిపాదన.

హైదరాబాద్‌, జూలై 19(ప్రజాక్షేత్రం): బీఆర్‌ఎస్‌లోని ఐదారుగురు బలమైన నేతలను ఆకర్షించి.. వారితో రాజీనామా చేయించి, వారిని తమ పార్టీలోకి తీసుకుని.. ఉపఎన్నికలకు వెళ్లాలని కమలనాథులు యోచిస్తున్నారా? తద్వారా రాష్ట్రంలో మరింత బలపడాలని భావిస్తున్నారా? అంటే.. ఆ పార్టీ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఇలా చేయడంవల్ల.. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై కూడా రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు కొందరు అంచనా వేస్తున్నారు. దీనిపై వారు పార్టీ జాతీయ నాయకత్వం వద్ద ఒక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామన్న నిబంధన కారణంగా పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు ముందుకు రావడం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.ఇప్పటికే కాంగ్రెస్ లోచేరిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు వాస్తవానికి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని.. కానీ, రాజీనామా అంశంపై తమ విస్పష్ట వైఖరి కారణంగా వారు చేరలేదని ఆ వర్గాలు వివరించాయి. మరికొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నా, మునుగోడు ఫలితం నేపథ్యంలో వారు పునరాలోచిస్తున్నట్టు సమాచారం. రాజీనామా చేశాక మళ్లీ కచ్చితంగా గెలిచే సత్తా ఉన్నవారిని ఆకర్షించి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా అటు కాంగ్రెస్‌ దూకుడుకు కళ్లెం వేయడంతో పాటు ఇటు బీఆర్‌ఎ్‌సనూ మరింత దెబ్బకొట్టినట్లు అవుతుందన్న అభిప్రాయం కొంతమంది ముఖ్యనేతల్లో ఉంది.

Related posts