పాత దరిద్రం పోతే కొత్త దరిద్రం..!
-గత సర్కారులానే రైతులకు మోసం.
-ఖజానాలో సొమ్ము లేకున్నా నమ్మించే యత్నం.
-రైతులకు అండగా బీజేపీ పోరాటం.
-నిబద్దతతో పనిచేస్తే స్థానిక విజయం కమలందే.
-తెలంగాణలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.
-అప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా పని.
-పార్లమెంట్‌లో తాండూరు మెజార్టీ ఆదర్శనీయం.
-పౌర సన్మానంలో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
తాండూర్ జులై 19(ప్రజాక్షేత్రం): తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన తప్పులనే కొత్త ప్రభుత్వం చేస్తుందని, పాత దరిద్రం పోతే కొత్త దరిద్రం వచ్చిందనే విధంగా పాలన మారిందని బీజేపీ చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు(ఎంపీ) కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, పట్టణ శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్‌లో చేవేళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పౌర సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా పలువురు నేతలు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గజమాల, పూల మాలలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దేశానికి గర్వకారణమన్నారు. తెలంగాణలోని 8 పార్లమెంట్ స్థానాల్లో బూతు స్థాయి నుంచి శక్తి, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పనిచేయడంతో అభ్యర్థుల గెలుపు సాధ్యమయ్యిందన్నారు. తాండూరులో గతంలో 4వేలు వస్తే పార్లమెంట్‌లో 80 వేలు ఓట్లు రావడం చారిత్రాత్మకమన్నారు. తాండూరులో స్వచ్చంద సంస్థలు, రాజకీయ, కుల సంఘాల మద్దతు మరువలేనిదన్నారు.
తన గెలుపుకు కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ఎన్నికలకు ముందే ఓటర్లు నిర్ణయించారని అన్నారు. ప్రతిపక్షాలు, కొందరు స్వార్థ రాజకీయాల కోసం రిజర్వేషన్ల మార్పు అంటూ బీజేపీపై దుష్ర్పచారం చేయడంతో తక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. అయినా ప్రధాని నరేంద్రమోడి పాలనతో బీజేపీ అధికారం చేపట్టిందని, అమిత్ షా, నడ్డాల పాత్ర కూడా ఉందన్నారు.
మళ్లీ మోసపూరిత పాలన
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మోస పూరిత పాలన పురుడు పోసుకుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పును కొత్త ప్రభుత్వం కూడా చేస్తుందన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా కూడా ప్రజలను, రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఒకేసారి రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందన్నారు.
దశల వారికి కొంత కొంత రుణమాఫీ చేయడం దోకా చేయడమే అన్నారు. 40లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా 10 లక్షల మందికి మాత్రమే అమలు చేస్తుందని విమర్శించారు. ఈ మోస పూరిత పాలనను ప్రజలు నమ్మరని అన్నారు. రైతులకు మోసం చేస్తే బీజేపీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు నేతలు, కార్యకర్తలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు.
నిబద్దతో పనిచేస్తే స్థానిక సమయంలో కమలం విజయం ఎవ్వరు ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, నాయకులు ఎం. నరేష్, గాజుల శాంతుకుమార్, బంటారం భద్రేశ్వర్, బొప్పి శ్రీహరి, రజనీకాంత్, కౌన్సిలర్లు అంతారం లలిత, బంటారం లావణ్య, బాలప్ప, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.