పట్టుకోసం కాంగ్రెస్ గట్టి ప్రణాళిక .. అసెంబ్లీ వేదికగా ఆధిపత్యమే లక్ష్యం.
-ఒక్కో పావు కదుపుతున్న కాంగ్రెస్ సర్కార్.
-ఎంపీ ఎన్నికల నుంచి గుణపాఠం.
-రాబోయే స్థానిక ఎన్నికలే టార్గెట్.
-విపక్షాలపై పై చేయికి తీవ్రయత్నం.
-ఆరు గ్యారంటీల అమలుపై కేంద్రీకరణ.
-భారీ ఆర్థిక యజ్ఞంతో మరో అడుగు.
-రూ.2లక్షల రుణమాఫీతో ముందడుగు.
హైదరాబాద్ జులై 19(ప్రజాక్షేత్రం):పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనేది అనుభవం నేర్పే గుణపాఠం. పోగొట్టుకోకపోయినా రాబట్టుకోవాల్సిన ఫలితాలు రాబట్టుకోకపోవడమంటే పొగొట్టుకోవడంగానే భావించాలి. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొద్ది రోజుల్లోనే ఈ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలొస్తే దాన్నుంచి పార్లమెంటు ఎన్నికల్లో మరింత సానుకూల ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ ఆశించింది. కానీ.. పూర్తి స్థాయి నష్టం వాటిల్లకపోయినప్పటికీ ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో మరోసారి ఇలాంటి నష్టం వాటిల్లితే కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ కాసింత ఆలస్యంగానైనా రాష్ట్రంలో అదే పని ప్రారంభించిందని భావించవచ్చు. ఈ నష్టనివారణ కోసం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని జోడించి రానున్న స్థానిక ఎన్నికలకు అంతర్గత ప్రణాళికను పకడ్బందీగా రూపొందించింది. రచించిన పథకాన్ని అమలు చేసేందుకు భారీ ఆర్థిక యజ్ఞాన్ని చేపట్టింది. ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ఆరు గ్యారంటీల అమలు, రూ.7లక్షల కోట్ల అప్పుల భారం ఉన్న నేపథ్యంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రూ. 2లక్షల రైతు రుణమాఫీకి రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఖజానాపై దాదాపు 32వేల కోట్ల ఆర్థిక భారం పడే రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ అమలు చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్, బీఆరెస్ మధ్య సాగిన రాజకీయ సవాళ్ళు, ప్రతి సవాళ్ల మధ్య సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో ప్రకటించినట్లు ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం నుంచి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారీ స్థాయి ప్రచార ప్రణాళికను సిద్ధం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కొద్ది కాలంలోనే జరిగిన పొరపాటును సరిదిద్దుకుంది.
*ఎంపీ ఎన్నికల్లో అడ్డంకులు.*
కాంగ్రెస్ పార్టీ అంగీకరించినా అంగీకరించకపోయినా, నెపాన్ని బీఆరెస్ మీదకు నెట్టేసినా.. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీగా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలుండగా ఒక స్థానం ఎంఐఎం గెలుపొందగా ఎనిమిది స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. మిగిలిన ఎనిమిది స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం. గత పార్లమెంటు ఫలితాలతో పోల్చితే కాంగ్రెకస్‌కు మెరుగైన ఫలితాలు రావచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆశించిన స్థాయి పార్లమెంటు స్థానాలను సాధించుకోలేక పోయిందీ. 2019 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 17 స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో బీఆరెస్, నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఎంఐఎం ఎంపీలు గెలుపొందారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా ఉన్న బీఆరెస్ అడ్రస్ పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా గల్లంతైంది. ఇది కాంగ్రెస్‌కు సంతోషకరమైన అంశమైనప్పటికీ మరో ప్రత్యర్థి పార్టీగా ఉన్న బీజేపీ అనూహ్యంగా పుంజుకుని కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడం కొరకరాని కొయ్యగా మారింది.
*గ్యారంటీల నుంచి రుణమాఫీదాకా.*
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మూడు దశల్లో మూడు రకాల హామీలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలను ఎన్నికల్లో ప్రధాన హామీగా కొనసాగించారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల అమలుకు ప్రయత్నించింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి పరీక్షగా మారగా ప్రతిపక్ష పార్టీలైన బీఆరెస్, బీజేపీ ఇదే అంశంపై టార్గెట్ చేసిన ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక వైఫల్యం ఎన్నికల్లో నష్టం చేసిందని ఫలితాలు తేల్చాయి. కేంద్రంలో బీజేపీ పదేండ్లు, రాష్ట్రంలో బీఆరెస్ పదేండ్లు అధికారంలో ఉండి కూడా ఇచ్చిన హామీలు అమలు చేయని అంశం పక్కకుపోయి, ఆరునెలల అధికారంలో ఆరు గ్యారంటీలు అమలు చేయలేదనే ఒత్తిడితో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు తాము చేసిన ప్రయత్నాన్ని వివరిస్తూనే బీజేపీ, బీఆరెస్‌లను మరోసారి ప్రజాక్షేత్రంలో హామీలు అమలు చేయని పార్టీలుగా నిలబెట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఈ విషయంలో బీఆరెస్‌పై కొంత విమర్శలు చేసినప్పటికీ, బీజేపీపై పదును తగ్గడం నష్టం చేసింది. ఈ ఏడు నెలల పాలన, పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం తీసుకున్న గుణపాఠం నుంచి కాంగ్రెస్ మేల్కొన్నట్లుంది. రానున్న స్థానిక ఎన్నికలతో పాటు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఒక్కో పావు కదుపుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఏడునెలల పరిపాలనా అనుభవంతో రాజకీయ గుణపాఠం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేల ఫిరాయింపులను యుద్ధ ప్రాతిపదికన ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాలు, అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న విధానాలపై విచారణలు ఒక వైపు, మరో వైపు ఎమ్మెలు పార్టీని వీడడం బీఆరెస్‌ను సమస్యల్లోకి నెట్టగా బీజేపీతో ఇప్పుడు ఇబ్బందులు తప్పేట్లు లేవు. పైగా మూడవసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడు నెలల్లో రాష్ట రాజకీయాల్లో మార్పు జరిగింది. బీజేపీ, బీఆరెస్ మధ్య అంతర్గత మితృత్వం నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాబోయే కాలంలో కాంగ్రెస్‌కు ఈ రెండు ప్రత్యర్థి పార్టీల స్నేహం ఇబ్బందులు సృష్టించనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ స్నేహం ఏ విధమైన ప్రభావం కనబరుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇది కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా పరిణమించునున్నది. ఈ కారణంగానే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు బీజేపీ, బీఆరెస్ రాజకీయ సవాళ్లకు సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు తాజా నిర్ణయం రుజువు చేస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేసేందుకు సిద్ధమైనట్లు భావిస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.2లక్షల రుణమాఫీతో భారీ ఆర్థిక కార్యక్రమాన్ని చేపట్టి బీఆరెస్, బీజేపీలకు దీటుగా సమాధానం చెప్పడంతో పాటు రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టు సాధించాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే జరిగిన నష్టం నుంచి నివారణ చర్యలు చేపడుతూ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రూ.32వేల కోట్ల రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రైతు వేదికల నుంచి సీఎం, మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం గమనార్హం. విస్తృత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ దశలోనే అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ, బీఆరెఎస్ కు గట్టి జవాబు చెప్పి రాష్టంపై రాజకీయ పట్టు సాధించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని భావిస్తున్నారు.