అడుగు కోమడుగు…ప్రమాదంలో ప్రయాణికులు…
-ఒక్కరోజు వర్షానికే జలమార్గంగా దర్శనమిస్తున్న మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు మార్గం.
-వరి నాట్లు వేసి నిరసన తెలుపుతున్న శ్రీరాంనగర్ గ్రామస్తులు..
-అయ్యా మా గ్రామాలకు బస్సు పంపండని వినతిలు.
-రోడ్లు బాగాలేకనే బస్సులు పంపమని ఆర్టీసీ అధికారులు.
మొయినాబాద్ జూలై 20(ప్రజాక్షేత్రం):ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అడుగుకో మడుగు తయారయ్యాయి. వర్షం ప్రభావంతో గతుకులతో పాటు కంకర తేలి ప్రమాదకరంగా మారాయి. చినుకు పడితే చిత్తడిగా మారే ఈ రోడ్లను బాగు చేసే మోక్షం ఎప్పుడోనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజు వర్షానికే మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్ ధ్వంసమయ్యాయి. వర్షం ప్రభావంతో ఎక్కడ చూసినా మడుగులే దర్శనమిస్తున్నాయి. దీంతో శ్రీరామ్ నగర్ గ్రామ యువకులు అంబేద్కర్ యూత్ యువజన సంఘం ప్రెసిడెంట్ మానుక ప్రవీణ్ ఆధ్వర్యంలో చిత్తడిగా మారిన రోడ్డుపై వరి నాట్లు వేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొయినాబాద్ – వెంకటాపూర్ రోడ్డుపై భారీ గుంతలు ఉండడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయిని, ద్విచక్ర వాహనదారులు రాత్రి వేళల్లో గుంతలను గమనించక గాయాలపాలవుతున్నారు. తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సు ట్రిప్పులు పెంచండి అని పలుమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ మీ మీ గ్రామాల రోడ్డు సరిగా లేనందునే బస్సులను పంపలేకపోతున్నామని మొహం మీదనే చెప్పి పంపడం చూస్తే ఈ రోడ్ల దుస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వీలైనంత తొందరగా మొయినాబాద్ – వెంకటాపూర్ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టక పొతే రాబోయే రోజుల్లో నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరేందర్, మనుక శ్రీకాంత్, గిడియోన్, ప్రదీప్, మనోజ్, బెన్నీ, రవితేజ, జ్ఞానేశ్వర్, భరత్, ప్రశాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.