Praja Kshetram
తెలంగాణ

వాయిదాతో ఎంత ముట్టింది?.. నిరుద్యోగులపై అక్రమంగా కేసులు : కేటీఆర్‌.

వాయిదాతో ఎంత ముట్టింది?.. నిరుద్యోగులపై అక్రమంగా కేసులు : కేటీఆర్‌.

-వాయిదాతో కోచింగ్‌ సెంటర్లకు లాభమన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

-ఇప్పడు వాయిదాతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంత ముట్టిందో చెప్పాలి.

-రాష్ట్రంలో భయానక వాతావరణం.

-గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు ఫిర్యాదు చేశాం.

-వరదలతో మేడిగడ్డ గొప్పతనం వెల్లడైంది.

-బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.

హైదరాబాద్ జులై 20(ప్రజాక్షేత్రం): రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బీఆరెస్‌ అండగా అండగా ఉంటుందని, వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకూ పోరాటం చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. గ్రూప్‌ 2 పరీక్షల వాయిదాతో సీఎం రేవంత్‌రెడ్డికి ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి మొన్న పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు లాభం వస్తుందన్నారు. గ్రూప్ 2 వాయిదా వేశారు.
ఇప్పుడు నాలుగు నెలలకు 400 కోట్ల లాభం వచ్చింది అనుకుంటే.. అందులో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వాటా ముట్టింది ఏమో ఆయనే చెప్పాలి’ అని కేటీఆర్‌ అన్నారు. శనివారం కేటీఆర్ నేతృత్వంలోని బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అణిచివేత వైఖరులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. హామీలు అమలు చేయాలన్న విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులు, ఆక్రమ కేసులతో భయానక వాతావారణం సృష్టిస్తున్నదని తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకొచ్చి అరెస్టులు చేశారని తెలిపామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారని, మొదటి సంవత్సరంలోని రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వ హామీలను గవర్నర్‌కు వివరించామన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన 30000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారే ఆ ఉద్యోగాలను ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని,జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్న అంశాలను గవర్నర్‌కు వివరించామన్నారు. తాము వివరించిన అంశాలపై గవర్నర్ చాలా సీరియస్ స్పందించారని, హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పారని తెలిపారు. బీఆరెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్న సంగతిని గవర్నర్‌కు వివరించామని చెప్పారు. ఒక పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి.. మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై గవర్నర్‌కు వివరించామని కేటీఆర్ తెలిపారు.
ప్రొటోకాల్ ఉల్లంఘనలను కూడా గవర్నర్‌కు చెప్పామన్నారు. ఈ విషయాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలుస్తామని,అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని విమర్శించారు.

*వరదలను తట్టుకుని నిలబడ్డ మేడిగడ్డ.*

మేడిగడ్డ కొట్టుకు పోయిందని.. కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగ పాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గుతో తల దించుకోవాలని కేటీఆర్ అన్నారు. అక్కడ జరిగింది చిన్న విషయమేనని, పెద్దది కాదని చెప్పామని గుర్తు చేశారు. కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తయ్యాయని, ఈ రోజు వరద నీరు వచ్చినా మేడిగడ్డ తట్టుకొని నిలబడటమే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనమని అన్నారు. మేడిగడ్డను త్వరలో సందర్శిస్తామని, విజువల్స్ తీసుకువచ్చి ప్రజలకు వివరంగా చెప్తామన్నారు.

Related posts