Praja Kshetram
తెలంగాణ

ఘనంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు .. దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.

ఘనంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు .. దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.

 

-తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం.

 

-కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, గవర్నర్ దత్తాత్రేయలు.

హైదరాబాద్ జులై 21(ప్రజాక్షేత్రం): సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు తొలిబోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చేవారికి హైదరాబాద్‌ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి అమ్మవారి దర్శనం కలిగేలా చూడాలని తెలిపారు. ప్రజల సహకారంతో బోనాలు విజయవంతం అవుతాయని చెప్పారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందన్నారు.

 

*పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి.*

 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి బోనాల పండగ సంప్రదాయం ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ వేడుక మనకు మాత్రమే ప్రత్యేకమన్నారు. దేశంలోని అన్నివర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దంపతులు బోనం సమర్పించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లు సైతం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఏర్పాట్లను పర్యావేక్షించారు. వీఐపీల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారిని శివసత్తులు దర్శించుకోవడానికి సమయం కేటాయించారు. సోమవారం రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగియనుంది.

Related posts