Praja Kshetram
తెలంగాణ

హైకోర్టులో జన్వాడ ఫామ్ హౌజ్ పిటిషన్‌.. నేడు విచారణ.

హైకోర్టులో జన్వాడ ఫామ్ హౌజ్ పిటిషన్‌.. నేడు విచారణ.

 

-హైడ్రా దూకుడుతో అలర్ట్‌.

శంకర్ పల్లి ఆగస్టు 21(ప్రజాక్షేత్రం): ఆక్రమ కట్టడాల కూల్చివేతలో దూకుడుగా సాగుతున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నజర్ ఇప్పుడు జన్వాడా ఫామ్ హౌజ్ పై పడింది. హైడ్రా జన్వాడ ఫామ్‌హౌజ్‌ను కూల్చివేయవచ్చన్న సమాచారంతో కేటీఆర్ అనుచరుడు, ఫామ్‌హౌజ్ యాజమానిగా చెబుతున్న బద్వేల్ ప్రదీప్‌రెడ్డి హైకోర్టులో స్టే ఆర్డర్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామం జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేతపై ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కఠినంగా ఉన్నారన్న ప్రచారానికి ఊతమిచ్చింది. కేటీఆర్ ఫామ్‌హౌజ్‌గా ప్రచారంలో ఉన్న జన్వాడా ఫామ్‌హౌజ్ వ్యవహారం మొదటి నుంచి రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. గతంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్‌హౌజ్‌ను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి అది అక్రమ నిర్మాణమంటూ ఆరోపించారు. ఈ వివాదంలో అక్రమంగా డ్రోన్ ఎగురవేశారంటూ బీఆరెస్ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేసింది. అప్పటి ఘటనకు హైడ్రాతో బదలా తీర్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లుగా బీఆరెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. జన్వాడ ఫామ్‌హౌజ్ జీవో 111 కు విరుద్ధంగా నిర్మించారని అందుకే హైడ్రా కూల్చివేతకు అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా జన్వాడ ఉస్మాన్ సాగర్ ఎఫ్‌టిఎల్‌ పరిధిలో తన ఫాంహౌజ్ లేదని పిటిషనర్ ప్రదీప్‌ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 14న తన ఫాంహౌజ్‌ను నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించారని తెలిపారు. రాజకీయ కారణాలతోనే తన ఆస్తికి నష్టం చేకూర్చాలని చూస్తున్నారని ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన వేసిన పిటిషన్‌పై కోర్టు ఏవిధంగా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషన్ రంగనాథ్, రంగారెడ్డి కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్ పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్లను పిటిషన్‌లో పేర్కోన్నారు. ఈ కేసును బుధవారం జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేయనుంది.

Related posts