Praja Kshetram
తెలంగాణ

పంచాయతీ పోరుకు కసరత్తు షురూ!

పంచాయతీ పోరుకు కసరత్తు షురూ!

 

-ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్‌ ఖరారు.

-సెప్టెంబరు 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రకటన.

(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రజాక్షేత్రం) పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఓటరు జాబితా తయారీకి ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన పక్రియ పూర్తికాగానే పంచాయతీ ఎనిల్నకలు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్దం చేసింది. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఖరారు చేసింది. దీని ప్రకారం సెప్టెంబరు 6వ తేదీన వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. ఈ జాబితాపై ఉమ్మడి జిల్లాలో సెప్టెంబరు 7వ తేదీ నుంచి 13 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంఽధించి 9,10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. అనంతరం 21న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఇదిలా ఉంటే ఎన్నికల సన్నాహాలకు క్షేత్రస్థాయిలో కూడా అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 29న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి గత జనవరి నెలాఖరు నాటికే పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరాల్సి ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికల కారణంగా పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన తీసుకువచ్చారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు కూడా నిర్వహించాలని సర్కార్‌ భావిస్తోంది.

ఆ గ్రామాల్లో లేనట్లే..

హైదరాబాద్‌ నగర శివార్లలోని కొన్ని గ్రామాలతో పాటు పురపాలికలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ మహానగరాన్ని మరింత విస్తరించేందుకు ఔటర్‌ రింగు రోడ్డుకు ఆనుకుని ఉన్న 45 గ్రామాలను ముందుగా సమీప పురపాలికల్లో విలీనం చేసి ఆ తరువాత గ్రేటర్‌లో కలిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇక్కడ ఓటర్ల జాబితా ప్రక్రియ చేపట్టడం లేదు. దీంతో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పంచాయతీ ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. పురపాలికల్లో విలీనమయ్యే గ్రామాలు మేడ్చల్‌ జిల్లా పరిధిలో అధికంగా ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లాలో 23 గ్రామాలు ఏడు పురపాలికల్లో విలీనం చేస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని నాలుగు పురపాలికల్లో 11గ్రామాలను విలీనం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు పురపాలికల్లో 11 గ్రామాలు విలీనం కానున్నాయి. ఇదిలా ఉంటే శివారు గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనంపై స్థానికంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పంచాయతీల విలీనం వల్ల తమపై పన్నుల భారం పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయ పోరాటనికి కొందరు కొందరు సిద్ధమవుతున్నారు.

Related posts