ఆక్రమణలకు పాల్పడాలంటేనే భయపడేలా చేస్తాం – హైడ్రా చీఫ్ రంగనాథ్.
-హడావిడి చేసి ఊరుకోం!
-నీతి నిజాయితీ కలిగిన బిల్డర్లను ఇబ్బంది పెట్టం.
-అధికారులు వేధిస్తే మా దృష్టికి తీసుకురండి.
-భవన నిర్మాణ వ్యర్థాలతో చెరువులను పూడ్చేస్తున్నారు.
-క్రమంగా చదును చేసి ఆక్రమించుకుంటున్నారు.
-కొంతమంది బిల్డర్ల తీరుతో అందరికీ చెడ్డపేరు వస్తోంది.
-ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములుంటే వ్యవసాయం చేయాలి.
-వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగిస్తే కూల్చివేస్తాం.
-హైడ్రా పరిధి మరింత విస్తరించేలా ఆలోచనలు.
-పక్కా ఆధారాలు, లోతైన అధ్యయనం తర్వతే యాక్షన్ తీసుకుంటున్నాం.
-బిల్డర్స్ అసోసియేషన్ భేటీలో హైడ్రా చీఫ్ రంగనాథ్.
హైదరాబాద్ ఆగస్టు 31(ప్రజాక్షేత్రం): హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణదారుల పాలిట సింహస్వప్నంగా మారిన హైడ్రా.. ఇక మీదట మరింత కఠినంగా వ్యవహరించబోతుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లో వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథ్, భూముల ధరలు పెరిగినందు వల్లే ఆక్రమణలు జరుగుతున్నాయని అన్నారు. నిజాయతీ కలిగిన బిల్డర్లను హైడ్రా ఇబ్బంది పెట్టదని, అదేవిధంగా అధికారులు ఎవరైనా బిల్డర్లను వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలని రంగనాథ్ సూచించారు.
వ్యర్థాలతో చెరువులను నింపేసి..
కొంతమంది పెద్ద బిల్డర్లు భవన నిర్మాణ వ్యర్థాలతో చెరువులను పూడ్చేస్తున్నారని, వాటిని క్రమంగా చదును చేసి ఆక్రమించుకుంటున్నారని రంగనాథ్ వెల్లడించారు. ఫలితంగా చెరువులు, నాలాలు కుంచించుకుపోయి వరద నీరు నగరాన్ని ముంచెత్తుతున్నట్లు వివరించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అనే అంశాలు ఇప్పటివి కావని, ఎప్పటి నుంచో ఉన్నవేనని అన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములుంటే వ్యవసాయం చేసుకోవాలే తప్ప నిర్మాణాలు చేపట్టకూడదని వివరించారు. పట్టా పేరుతో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే మాత్రం కూల్చివేతలు తప్పవంటూ ఇటీవలి ఎన్-కన్వెన్షన్ ఘటనను ఉదహరించారు.
హైడ్రా పరిధి మరింత విస్తరించేలా…
ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌ల పైన ప్రజలు అవగాహన తెచ్చుకుంటున్నారన్న హైడ్రా కమిషనర్, వాటి పరిధిలోని భూములను కొనుగోలు చేయకుండా అప్రమత్తమవుతారని తెలిపారు. ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు నోటీసులు అవసరం లేదని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పాయన్న రంగనాథ్, అందుకు చట్టాలు సైతం ఉన్నాయన్నారు. కొంతమంది పలుకుబడి ఉపయోగించి అనుమతుల ముసుగు తొడిగిన అక్రమ నిర్మాణాలను సైతం వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులపై నిఘా.
కూల్చివేతలకు వెళ్లే ముందు ఆయా నిర్మాణాలకు సంబంధించి లోతైన అధ్యయం, పక్కా ప్రణాళికతోనే అడుగు ముందుకు వేస్తున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. 2, 3 నెలలు హడావిడి చేసి మాయమైపోవడం కాకుండా, పదేళ్లలో నగర రూపురేఖలు మారేలా పని చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకే ఉన్నప్పటికీ భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందన్నారు. అలాగే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీపైనా హైడ్రా నిఘా ఉంటుందని, అక్రమ అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేస్తుందని రంగనాథ్ తెలిపారు.