Praja Kshetram
తెలంగాణ

క్షేత్రం సురక్షితమేనా.?!

క్షేత్రం సురక్షితమేనా.?!

 

-ఉమామహేశ్వరంలో కొండల నుంచి ప్రవహిస్తున్న వరద.

-నీటి ఉధృతికి కదులుతున్న బండరాళ్లు.

-గతంలో విరిగిపడిన కొండ చరియలు.

-భయం మాటున భక్తులు.

అచ్చంపేట, ఆగస్టు 31(ప్రజాక్షేత్రం): నల్లమలలో ఎత్తయిన కొండల్లో కొలువైన ఉమామహేశ్వర స్వామి ఆలయానికి భద్రత పైలమా.. అన్న సందేహం కలుగక మానదు. కొన్నేళ్లుగా వాతావరణ మార్పులతో అతివృష్టి, అనావృష్టి కారణంగా కారణంగా అధిక వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడచిన మూడేళ్లలో భారీ వర్షాలతో ఉమామహేశ్వర క్షేత్రంలో కొండ చరియలు విరిగిపడడమే కాకుండా భారీ వృక్షాలు సైతం పడిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇక జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాల్లో శ్రీశైలం ఉత్తర ముఖ ద్వారమైన ఉమామహేశ్వర దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో పరమశివుడు ఉమాదేవీసమేత ఉమా మహేశ్వరస్వామిగా కొలువుదీరి ఉన్నాడు. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు రావణవధ అనంతరం శ్రీశైల ప్రదక్షిణ ఈ క్షేత్రం నుంచే ప్రారంభించినట్లు శ్రీశైల పురాణం చెబుతోంది. కాకతీయుల కాలంలో ఈ క్షేత్ర నిర్మాణం జరిగినట్లు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. పార్వతిదేవి శివుడే భర్తగా లభించాలని ఇక్కడ తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమై వరమిచ్చిన ప్రదేశం ఇదని.. అందువల్లనే ఈ క్షేత్రానికి ఉమామహేశ్వరం అనే పేరు వచ్చినట్లు తెలుస్తుంది. ఇంతటి క్షేత్రానికే భద్రత లేదా అన్న సందేహం ప్రస్తుతం కలుగక మానదు. ప్రధానంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఈ ఆలయం ఉండడం విశేషం. అయితే, ఇటీవలి కాలంలో శ్రీశైలం వెళ్లే ప్రధాన మార్గంలోని పాతాళగంగ సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు ఉన్నాయి. గతంలో మూడు, నాల్గుసార్లు ఉమామహేశ్వర క్షేత్రంలో కొండ చరియలు విరిగిపడి పెను ప్రమాదం తప్పింది. మూడేళ్ల కిత్రం మెట్ల మార్గం సమీపంలోని భారీ వృక్షం నేలకొరగడంతో అప్పుడూ పెద్ద ప్రమాదం తప్పింది. నల్లమల కొండల మధ్య ఉన్న ఈ క్షేత్రాన్ని అన్నివిధాలా అభివృద్ధిపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షేత్ర సమీపంలోని కొండలను పరిశీలించి లూజుగా ఉన్న బండరాళ్లను తొలగించడంతో పాటు, భద్రత కోసం నెట్‌ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని యాదాద్రి ఆలయ తరహాలో ఉమామహేశ్వర క్షేత్రాన్ని కూడా మరో శ్రీశైలంలా అభివృద్ధిపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచిస్తున్నారు.

Related posts