వరద సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు : సిఎం చంద్రబాబు.
-బాధితులను ఆదుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాం.
-ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు.
-మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ.
విజయవాడ సెప్టెంబర్ 03 (ప్రజాక్షేత్రం): వరదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం విజయవాడ కలెక్టరేట్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. విపరీతంగా వచ్చిన వరదతో మూడు రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారిని ఇబ్బందుల నుండి బయటకు తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా. 6 హెలికాప్టర్లు, 30 డ్రోన్లు తెప్పించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. 179 సచివాలయవాల పరిధిలో…ఒక్కో సచివాలయానికి ఒక సీనియర్ అధికారిని నియమించాం. బాధితుల వద్దకు ట్రాక్టర్లు, వ్యాన్లు, ప్రొక్లెయిన్లు, బోట్లు… ఎలా వెళ్లడానికి సాధ్యమైతే ఆ విధంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాం. 32 మంది ఐఏఎస్ అధికారులు విధుల్లో ఉన్నారు. 10 జిల్లాల నుండి బాధితుల కోసం ఆహారం తెప్పిస్తున్నాం. మూడు పూటలా బాధితులకు ఆహారం అందిస్తున్నాం. చివరి వ్యక్తి వరకూ సాయం అందిస్తాం. నా సర్వశక్తులొడ్డైనా బాధితులను ఆదుకుంటా. రెండు రోజులు ఇబ్బంది పడ్డారు. ఇక ఇబ్బంది పడటానికి అవకాశం ఉండకూడదు. ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వాటిని పాటించకపోతే కఠిన చర్యలకు తీసుకోవడానికి వెనకాడను. ఆహార సరఫరా సమయంలో బాధితులు ఎక్కువగా గుమికూడకుండా ఉంటే మీరుండే ప్రాంతానికే తీసుకొచ్చి అందిస్తాం. ఒక్కో బోటులో నలుగురు సిబ్బంది, ఒక ఆక్టోపస్, ఒక గ్రేహౌండ్ ఉంటారు. సరిగా పనిచేయని పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా… ప్రజలకు నష్టం జరిగితే ఊరుకునేది లేదు. రెండు రోజులుగా వరద బాధిత ప్రజలు పడుతున్న బాధలు నేను నేరుగా చూశాను. బిడ్డను బతికించుకోవడానికి భార్యను భర్త వదిలి రావాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. వృద్ధులు నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంట్లోకి నీళ్లతో పాటు పాములు వచ్చి చేరుతున్నాయి. దీంతో భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి కుటుంబం బాధలో ఉంది. మానవతా దృక్పదంతో పని చేద్దాం. బాధితులు కూడా ఐవీఆర్ఎస్ కాల్ కు సరైన సమాధానం ఇవ్వండి. ఎక్కడ ఆహారం అందలేదో అక్కడికి అధికారులను పంపుతాం. విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. మూడు రోజులుగా వదర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నా….ఇక నుండి ఎవ్వరు పని చేయకపోయినా కఠిన చర్యలు ఉంటాయి. మానవతా దృక్పదంతో పనిచేసే ప్రభుత్వ ప్రతిష్ట పెంచుకుందాం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు ఒడ్డి కాపాడాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదు. బాధితుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం. బాధితులంతా సంయమనం పాటించాలి. అరగంట ఆలస్యమైనా అందరికీ న్యాయం చేస్తాం. రాష్ట్రంలోని ప్రజలకు కూడా పిలుపునిస్తున్నా…సమాజంలో బాధ్యత కలిగిన మనం బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా సాయం అందిస్తారో మీ ఇష్టం. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భోజనం అందిస్తారా, నిత్యావసర సరకులు అందిస్తారా, పరామర్శించి ధైర్యం చెప్తారా…ఏదైనా మీ శక్తి మేరకకు చేయండి. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. మేము చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం.’ అని ఆయన అన్నారు.
*వారిది చెత్త రాజకీయం.*
కొందరు చెత్త రాజకీయాలు చేయకుండా ప్రజాహితం కోసం పనిచేయాలి. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయి. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. సహాయకచర్యలకు భంగం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కుట్రలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని సాహించేది లేదు.
మీడియా ప్రతినిధులు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సమంజసం కాదు. పెద్ద ఎత్తున నీటి ట్యాంకులు తెప్పించి పరిసరాలు శుభ్రం చేస్తాం. మరో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఐదేళ్లు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. అధికారులు పని చేయడం మానేశారు. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొందరు అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా పంపించాం. ఇప్పటికే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశాం. సరిగా పని చేయకపోతే ఎవరినీ ఉపేక్షించం. మంత్రులు కూడా సరిగ్గా పనిచేయకపోయినా చర్యలు తీసుకుంటాం.
మన కుటుంబ సభ్యులు ఒకరు చనిపోతే మనం ఎలా బాధపడతామో అధికారులు కూడా ప్రజల బాధల పట్ల అదే విధంగా ఆలోచించాలి. ఎన్నో ఘటనలు చూశాను. అందుకే నాకు బాధ కలిగింది. వర్షం పడి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే గుడ్లవల్లేరు కాలేజీలో సమస్య అంటూ మాట్లాడుతున్నారు. సిగ్గుంటే ఇలా మాట్లాడతారా.? రాజకీయ ముసుగులో నేరస్తులుగా ఉండేవారు మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లపైనా విచారణ చేస్తాం. బోట్లు తగిలిన చోట్ల పిల్లర్ దెబ్బతింది. ఫుడ్ పాయిజన్ చేస్తున్నారు. బాబాయ్ ని చంపి నారాసుర రక్త చరిత్ర అని నాపై వార్తలు రాసిన వాళ్లపై ఇలాంటి అనుమానులు ఎందుకు రావు.? తప్పులు జరక్కుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దుర్మార్గుల నుండి ప్రజల్ని కాపాడుకుని మనం ముందుకెళ్లాలి. ఏస్థాయిలో తప్పు జరిగినా ఉపేక్షించను. నిన్న, మొన్న కొందరు అధికారులు సరిగా పని చేయలేదు. ప్రజలు కట్టే పన్నుల నుండి జీతాలు తీసుకుంటున్నారని గుర్తుంచుకోవాలి. సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి పరువు పోగొట్టుకోవద్దు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరుతున్నా.’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
*5 నిమిషాలు షో చేసి వెళ్లారు.*
నిన్న ఐదు నిమిషాలు జగన్ వచ్చి షో చేశారు. కనీసం ఒక్కరికైనా ఒక పొట్లం ఆహారమైనా అందించారా.? ఒక్కరినైనా రక్షించారా..కనీసం పలకరించారా.? వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అంతర్జాతీయ డ్రగ్ మాఫియా డాన్ ఎస్కో బార్ కూడా జగన్ లాగే వ్యవహరించేవారు. వీఆర్ లో పెడితే పని చేయరా…జీతం తీసుకోవడం లేదా.? ప్రజలు ఉంటేనే మనం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కొందరు మీనవేషాలు లెక్కిస్తున్నారు. నేను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు సాయం అందించాలని ఆదేశించినా క్షేత్ర స్థాయిలో కొందరు అధికారులు పని చేయడం లేదని బాధితులు చెప్తున్నారు. హుద్ హుద్ సమయంలో చేసిన సేవలను నాడు ప్రధాని చూసి అభినందించారు. ఈ వరదలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఇక్కడే ఉండి పని చేస్తున్నాం. మూడు రోజులు బిడ్డకు పాలు అందకపోతే ఏ తల్లిదండ్రులైనా బాధపడతారు..అందుకే మానవతా దృక్పందంతో పని చేయాలని చెప్తున్నా. రేపటిలోగా సరిగా పని చేయని అధికారులు తీరు మార్చుకోకపోతే ఇక ఆ తర్వాత మీరే చూస్తారు’ అని సీఎం హెచ్చరించారు.
