కెనడాలో హైదరాబాద్ వాసి మృతి.
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ప్రజాక్షేత్రం): ఉన్నత చదువుల కోసమని కెనడా వెళ్లిన మీర్ పేట్‌కు చెందిన ప్రణీత్ (27) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ బాలాజీ నగర్‌లో నివాసముండే అడుప.రవి సునీతలకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం వీరు కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మృతుడు ప్రణీత్ 2019లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లగా తన సోదరుడు కూడా 2022లో ఉన్నత చదువుల కోసమని కెనడా వెళ్ళాడు. ఆదివారం ప్రణీత్ పుట్టినరోజు కావడంతో తన సోదరుడితో పాటు తన స్నేహితులతో కలిసి టొరంటో సిటీలోని లేక్లియర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రణీత్ చనిపోయారు. అక్కడే ఉన్న సోదరుడు, స్నేహితులు కాపాడాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. నీటిలో మునిగి ప్రణీత్ మృతి చెందాడని అక్కడే ఉన్న సోదరుడు తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.దీంతో ఉన్నత చదువుల కోసమని వెళ్లిన తమ కుమారుడు పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకానికి వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తెప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.