Praja Kshetram
తెలంగాణ

ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ.

ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ.

 

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజాక్షేత్రం):త్వరలో టీజీఎస్‌ ఆర్టీసీలో 3వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సంస్థలో మిగిలిన ఖాళీలను సైతం భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. ఆదివారం కరీంనగర్‌లో 33 ఎలక్ట్రిక్ బస్సును మంత్రి పొన్నం ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దసరా పండగ లోపు ఉద్యోగులకు బకాయిలు లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లుగా ఆర్టీసీ‌లో ఉద్యోగులు, బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. గతంలో కష్టాల‌ను ఎదురుకొన్న ఆర్టీసీ ప్రస్తుతం స్వంతంగా బస్సులు కొనుగోలు చేస్తుందని చెప్పారు. కేవలం హైదరాబాద్‌ నగరంలో ప్రయాణికుల కోసం 2,500 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీని రక్షించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో డిజిల్‌తో నడిచే బస్సులను తగ్గించి.. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల సమయాల్లో విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టిసీ బస్సులు నడిపే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్‌లో రవాణా పరంగా అన్ని సౌకర్యాలు ఉండే విదంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం నడుస్తుందన్నారు. ఇప్పటి వరకు 92 కోట్ల మంది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారని వివరించారు. రూ.3,200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు మహిళలకు అందించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే చెందుతుందన్నారు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందు పరిచింది. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఓటరు పట్టం కట్టాడు. దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. అనుకున్నట్లే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పథకాన్ని అమలు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. కర్ణాటకలో సైతం ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అక్కడ సైతం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం విధితమే.

Related posts