రుణమాఫీ కాలేదని బీజేపీ నేతలు దీక్ష చేయడం విడ్డూరం: జగ్గారెడ్డి.
హైదరాబాద్ అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం): రైతులకు రుణమాఫీ ఆలస్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేశామని, డేటా సరిగా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ ఆలస్యమవుతోందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రూ.18 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. దాచుకోవడానికి ఏమీలేదని, డేటా సరిగా లేకపోవడం వల్లే మిగిలిన రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ జరగలేదని బీజేపీ నేతలు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో తన ఉనికిని పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే తమ ప్రభుత్వంపై బురద జల్లుతోందన్నారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తానని చెప్పిన ప్రధాని మోడీ దానిని తెచ్చారా? అని నిలదీశారు.