Praja Kshetram
తెలంగాణ

ఇది మీ జిల్లా కాదు.. ఇక్కడ మీకు కాన్పు చేయం.. రేవంత్ పాల‌న ఇదీ..

ఇది మీ జిల్లా కాదు.. ఇక్కడ మీకు కాన్పు చేయం.. రేవంత్ పాల‌న ఇదీ..

 

జ‌న‌గామ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం): ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప‌ని చేస్తున్నకొంత మంది వైద్యులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇత‌ర జిల్లాల వారు మా జిల్లాలోకి చికిత్స కోసం రావొద్ద‌ని డాక్ట‌ర్లు చెబుతున్న ప‌రిస్థితులు తెలంగాణ‌లో అక్క‌డ‌క్క‌డ వెలుగు చూస్తున్నాయి. చికిత్స కోసం వెళ్లిన ఓ నిండు గ‌ర్భిణికి ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంది. జనగామకు చెందిన శృతికి భువనగిరికి చెందిన మిట్ట వేణుతో వివాహం జరిగింది. గ‌ర్భం దాల్చిన నాలుగో నెల నుంచి జనగామ మాతా, శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లోనే పరీక్షలు చేయిస్తున్నారు. చివరి నెల పరీక్ష కోసం శృతిని ఆమె తల్లి మళ్లీ ఎంసీహెచ్‌కు తీసుకెళ్లగా ప్రసూతి వైద్యులు వైద్యం చేసేందుకు నిరాక‌రించారు. యాదాద్రి జిల్లాకు చెందిన గర్భిణివి ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. వేరే జిల్లాకు చెందిన వారికి ఇక్కడ కాన్పు చేయం. మీ జిల్లాలో పెద్దాస్పత్రి ఉంది కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు డాక్ట‌ర్లు. ఈ వ్య‌వ‌హారంపై జ‌న‌గామ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి స్పందించారు. స్థానికంగా ప్రసూతి డాక్టర్ల కొరత ఉండటంతో, అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో కాన్పు చేయించుకోవాలంటున్నామే తప్ప సొంత జిల్లా కాదని నిరాకరించలేదని, శృతిని అడ్మిట్ చేసుకోవాలని డాక్టర్లకు చెప్పామని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు.

Related posts