మోదీ అలా చేస్తే.. బీజేపీకి ప్రచారం చేస్తా: అరవింద్ కేజ్రీవాల్.
న్యూఢిల్లీ అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం): ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తే బీజేపీ కోసం తాను ప్రచారం చేస్తానని అన్నారు. ‘జనతాకీ అదాలత్’ పేరుతో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలోపు మొత్తం 22 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందించాలని ప్రధాని మోడీకి నేను సవాల్ విసురుతున్నా. ఒకవేళ ఆయన అలా చేస్తే, నేను బీజేపీకి ప్రచారం చేస్తా’ అని అన్నారు. కాగా, ఢిల్లీలో బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతోపాటు హోంగార్డుల జీతాలు నిలిపివేయడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. పేదలంటే బీజేపీకి వ్యతిరేకమని విమర్శించారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, ఎల్జీ పాలనలో ఉందని ఆయన ఆరోపించారు. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాలు విఫలమయ్యాయని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ‘డబుల్ ఇంజిన్’ మోడల్‌ను డబుల్ లూట్, డబుల్ అవినీతి అని ఆరోపించారు. హర్యానా, జమ్ముకశ్మీర్‌లోని బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు త్వరలో కూలిపోతాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు.