శంకర్ పల్లి ఆర్టీసీ బస్టాండ్ లో చీకట్లు.. ప్రయాణికులకు ఇక్కట్లు.
-వెలిగేది ఎప్పుడో.. ఆరేది ఎప్పుడో.. దేవుడికే ఎరుక!
శంకర్ పల్లి అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో గాడాంధకారం అలముకొని ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. బస్టాండ్ లోపటికి ప్రయాణికులు వచ్చే రోడ్డుపై వీధి దీపాలు వెలగక పోవడంతో పలు చిమ్మచీకట్లు అలము కుంటున్నాయి. ఎన్నో రోజుల నుండి ఈ సమస్య పట్టిపీడిస్తున్నా ఆర్టీసీ అధికారుల నుండి చలనం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ బస్టాండ్ లో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీధిలైట్లు ఎప్పుడు వెలుగుతాయో.. ఎప్పుడు ఆరిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.