‘నేవీరాడార్’ ఏర్పాటును అడ్డుకుంటాం.
-ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర.
-అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క.
-‘సేవ్ దామగుండం’ పేరిట బతుకమ్మ సంబురాలు.
పూడూరు, అక్టోబరు 06(ప్రజాక్షేత్రం):నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటు చేసి మూడు నదులు పుట్టుక నేలను ఏడారిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు. ఆదివారం పూడూరు మండల పరిధిలోని దామగుండం అటవీ ప్రాంతంలో బహుజన బతుకమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని బతుకమ్మను పేర్చి వేడుకల్ల్లో ఆడిపాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఈసీ, మూసీ, కాగ్నా నది పుట్టకతోనే హైదరాబాద్ సస్యశ్యామలంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నేవీ రాడార్ కేంద్ర ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఉన్న 12లక్షల చెట్లతోపాటు జీవనదులు, వన్యప్రాణులు అన్ని నశించిపోయే ప్రమాదం ఉందన్నారు. రూ.వంద కోట్లు కేటాయించి మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌కు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. నేవీరాడర్ ఏర్పాటు ఆలోచన ను విరమించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో నేవీ ప్రాజెక్టు కాకుండా రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రాజెక్టు ఏర్పాటును అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటూనే ఉన్నామని అన్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఇటువంటి ప్రాజెక్టు ఏర్పాటు చేయనియమిని హెచ్చరించారు. దామగుండం వాతావరణాన్ని ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎస్‌ఏపీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ దేవకి దేవి మాట్లాడుతూ చేయిచేయి కలిపి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ‘దామగుండాలు చల్లగుండా.. నువ్వు సల్లగుండాలా’ అనే పాటను విమలక్క, దామగుండం సత్యానందస్వామితో కలిసి పాటల సీడీని ఆవిష్కరించారు. భారీ వాన కురిసినా లెక్క చేయకుండా బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో తులసిచందు, హైకోర్టు అడ్వకేట్ రాంచంద్రన్న, భద్రన్న, మల్లేశం, మహిళలు తదితరులు పాల్గొన్నారు.