Praja Kshetram
జాతీయం

జమ్మూకాశ్మీర్ లో కూటమి ప్రభంజనం

జమ్మూకాశ్మీర్ లో కూటమి ప్రభంజనం

 

 

హైదరాబాద్ అక్టోబర్ 08 (ప్రజాక్షేత్రం):జమ్మూకశ్మీర్‌లో అధికార పీఠం నేషనల్‌ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)- కాంగ్రెస్ కూటమికి సొంతమైంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఎన్‌సీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ఆ పార్టీ ప్రస్తుతం 41 స్థానాల్లో విజయం సాధించింది. మరోచోట ఆధిక్యంలో కొనసాగుతుంది. భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ ఆరు సీట్లు దక్కించుకుంది. ఆ కూటమిలో మరో భాగస్వామి పార్టీ సీపీఐ(ఎం) సైతం ఒక స్థానాన్ని సొంతం చేసుకుంది. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్ 48 సీట్లు ఎన్‌సీ కూటమికి దక్కినట్లయింది. మరోవైపు బీజేపీ 27 స్థానాల్లో గెలుపొందగా.. రెండు స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 90 స్థానాలున్న అసెంబ్లీలో 2014లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 87 సీట్లలో బీజేపీ 25 స్థానాలు సాధించింది. పీడీపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో సీట్లు 90కి పెరిగాయి. అయితే గవర్నర్‌ కోటాలో ఐదు నామినేటడ్‌ సీట్లు ఉన్నాయి. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ 48గా ఉంది. 2019లో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌)గా కేంద్రం విభజించింది. ఈ నేపథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయ ఢంకా మ్రోగించింది. అక్కడి మరో ప్రాంతీయ పార్టీ పీడీపీ మూడు స్థానాలు దక్కించుకుంది. ఇండియా బ్లాక్ లో భాగమైన ఆప్‌.. ఇక్కడ తొలిసారి పోటీ పడి, ఖాతా తెరిచింది. స్వతంత్రులు ఏడు స్థానాలు దక్కించుకున్నారు. ఈ విజయంతో సంతోషంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతారని తెలిపారు. ‘పదేండ్ల తర్వాత ప్రజలు తమ తీర్పును తెలియజేశారు. 2019 ఆగస్టు 5 నాటి నిర్ణయాన్ని (ఆర్టికల్‌ 370 రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ) తాము అంగీకరించడం లేదని స్పష్టంగా చెప్పారు. ఒమర్‌ అబ్దుల్లానే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మా కూటమి నిరంతరం పోరాడుతుంది’’ అని ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.

Related posts