మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు.. రేవంత్‌కు మందకృష్ణ హెచ్చరిక.
-వర్గీకరణ లేకుండా డిఎస్సి పోస్టులను భర్తీకి నిరసన.
-మాదిగలకు రేవంత్ నమ్మకద్రోహం.
హైదరాబాద్ అక్టోబర్ 08 (ప్రజాక్షేత్రం):ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగవంతం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేయాలని.. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నేతలకు పిలుపునిచ్చారు.
మాలలకు కొమ్ము కాస్తూ…
హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్ బాగ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని.. మాదిగలను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆచరించడం లేదని.. మాలల పక్షాన నిలుస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌గా మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చి.. మాలలకు ఎక్కువ టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో మాదిగలకు నాలుగు సీట్లు తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.
అలా చెప్పి.. ఇలా చేస్తారా.
వివేక్, వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా.. వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. పార్టీ మారి వచ్చిన వివేక్ కుటుంబంలో రెండు సీట్లు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి వాళ్లతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కడియం శ్రీహరిని తానే ఆహ్వానించానని రేవంత్ రెడ్డే చెప్పారని.. సిట్టింగ్ ఎంపీ అయిన పసునూరు దయాకర్‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను తొలుత దేశంలో అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన అర్ధ గంటకే రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారని తెలిపారు. అయితే రెండు నెలలు కాకముందే రేవంత్ రెడ్డి మాదిగలకు వెన్నుపోటు పొడిచారని విరుచుకుపడ్డారు.
పొన్నంను చూసి గర్వపడుతున్నా…
ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఎలాంటి నియామకాలు జరపవద్దని కోరామన్నారు. వర్గీకరణ లేకుండానే రేపు 11 వేల ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేస్తున్నారన్నారు. మాల సామాజికవర్గానికి చెందిన మల్లిఖార్జున్ ఖర్గే, కొప్పుల రాజు ఆగ్రహానికి గురై పదవి కోల్పోవాలా అని రేవంత్ రెడ్డి మాదిగ ఎమ్మెల్యేలతో అన్నారని … అవసరమైతే త్వరలో ఆ ఎమ్మెల్యేల పేర్లు బయట పెడుతానని అన్నారు. రేవంత్ రెడ్డి మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 15న ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై బీసీ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్‌ను చూసి గర్వపడుతున్నానని.. దామోదర్ రాజనర్సింహను చూసి సిగ్గుపడుతున్నా అని అన్నారు. బీసీ సమావేశాలకు హాజరై కులగణన జరిగే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని పొన్నం ప్రభాకర్ గట్టిగా చెబుతున్నారన్నారు. బీసీల ప్రయోజనాల కోసం పొన్నం ప్రభాకర్ ధైర్యంగా మాట్లాడుతున్నారని చెప్పారు. మాదిగ కోటాలో మంత్రి అయిన దామోదర్ రాజనర్సింహ మాదిగల ప్రయోజనాల కోసం మాట్లాడటం లేదని మండిపడ్డారు. జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే వర్గీకరణ జరిగే వరకు ఉద్యోగ నియామకాలు ఆపాలని.. లేకపోతే బయటకు రా దామోదర రాజనర్సింహ అంటూ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.