Praja Kshetram
తెలంగాణ

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ త‌ర్వాతే గ్రూప్-1 మెయిన్స్ నిర్వ‌హించాలి.. రేవంత్ రెడ్డికి మంద‌కృష్ణ మాదిగ డిమాండ్

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ త‌ర్వాతే గ్రూప్-1 మెయిన్స్ నిర్వ‌హించాలి.. రేవంత్ రెడ్డికి మంద‌కృష్ణ మాదిగ డిమాండ్

 

హైద‌రాబాద్ అక్టోబర్ 10(ప్రజాక్షేత్రం):ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ కోసం ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న నియామ‌కాల‌కు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ వ‌ర్తింప‌జేస్తామ‌ని కాంగ్రెస్ స‌ర్కార్ స్ప‌ష్టమైన ప్ర‌క‌ట‌న చేయాల‌ని ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. క‌మిటీల పేరుతో కాల‌యాప‌న చేసి, క‌మిష‌న్ల పేరుతో జాప్యం చేసి, ఉన్న ఉద్యోగాల‌ను కొల్ల‌గొడుతాం అంటే మాదిగ జాతి ప్ర‌జ‌లు ఊరుకోరు అని హెచ్చ‌రించారు. ఎమ్మార్పీఎస్ కార్యాల‌యంలో మంద‌కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు.
గ్రూప్-1 పోస్టుల‌కు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేయ‌క‌పోతే త‌మ బిడ్డ‌లు ప‌దేండ్లు న‌ష్ట‌పోతార‌ని, ఐఏఎస్‌లుగా అవ‌కాశాలు కోల్పోతార‌ని మంద‌కృష్ణ మాదిగ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. ఇప్ప‌టికే ఇచ్చిన నోటిఫికేష‌న్ల‌కూ వ‌ర్గీక‌ర‌ణ చేస్తామ‌ని, అవ‌స‌ర‌మైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజ‌ర్వేష‌న్లు వర్తింప‌జేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించార‌ని మంద‌కృష్ణ గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట‌ను రేవంత్ రెడ్డి మ‌రిచారు. వ‌ర్గీక‌ర‌ణ చేయ‌కుండానే డీఎస్సీ పోస్టులు భ‌ర్తీ చేశారు. గ్రూప్-1 పోస్టుల‌కు వ‌ర్గీక‌ర‌ణ వ‌ర్తింప‌జేయాలి. వ‌ర్గీక‌ర‌ణ త‌ర్వాతే గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి. ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల వ‌ర్గీక‌రణ 2 నెల‌ల్లో పూర్తి చేయాల‌ని, అప్ప‌టి వ‌ర‌కు కొత్త‌గా నోటిఫికేష‌న్లు జారీ చేయొద్ద‌ని రేవంత్ ఆదేశించారు. గ్రూప్-1, 2, 3 ప‌రీక్ష‌లు కూడా రెండు నెల‌లు ఆపి, రిజ‌ర్వేష‌న్లు పూర్త‌య్యాకే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి. వ‌ర్గీక‌ర‌ణ చేయ‌కుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే ఉద్య‌మిస్తామ‌ని మంద‌కృష్ణ మాదిగ‌ హెచ్చ‌రించారు.

 

 

Related posts