తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలిపిన ‘అలయ్ బలయ్’
హైదరాబాద్, అక్టోబర్ 13 (ప్రజాక్షేత్రం):హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో అందరూ ఒక తాటికి వచ్చి కలిసి పని చేసేందుకు ఉపయోగపడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అలయ్ బలయ్ స్ఫూర్తితోనే తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయిందని ఆయన గుర్తు చేశారు. అంతకుముందు రాజకీయ నాయకులు విడివిడిగా ఎవరికీ వారు కార్యక్రమాలు నిర్వహించుకునే వారని తెలిపారు.
కానీ అలయ్ బలయ్‌తో గవర్నర్ దత్తాత్రేయ అందర్నీ ఒక తాటిపైకి తీసుకు వచ్చారన్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలయ్ బలయ్ కార్యాక్రమం తెలంగాణ సంస్కృతిని కాపాడే మంచి కార్యక్రమం అని ఆయన అభివర్ణించారు. గత 19 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారన్నారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించటం నిజంగా అభినందనీయమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమం కావడంతో కాంగ్రెస్ పార్టీలోని నేతలమంతా తరలివచ్చినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ, ఉత్తరాఖండ్ గవర్నర్, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సమైక్యత వారధుల నిర్మాణం ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. పండుగలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు సామాజిక ప్రాధాన్యత కూడా ఉందన్నారు. సమైక్యత అంటే అందరూ ఒకేమాట మీద నిలబడటమే కాదు.. ఇతరుల ఇష్టాలను సైతం గౌరవించటమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
అలయ్ బలయ్ కార్యక్రమంలో రాజకీయ నేతల సందడి..
ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందనరావు తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, వీహెచ్, కేకేలు విచ్చేశారు. బీఆర్ఎస్ నుంచి తలసాని, శ్రీనివాసగౌడ్, స్వామి గౌడ్ వచ్చారు. ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం, ఆర్ కృష్ణయ్యలు హాజరయ్యారు. అలాగే ఏపీ మంత్రి సత్యకుమార్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.