Praja Kshetram
తెలంగాణ

అప్పుల కుప్పగా తెలంగాణ

అప్పుల కుప్పగా తెలంగాణ

-బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం దివాలా.

-సీఎం రేవంత్‌ కృషితో ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.

-అతి త్వరలో హైదరాబాద్‌- బీజాపూర్‌ హైవే విస్తరణ పనులు.

-పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాకు సాగు నీరు.

-కలెక్టరేట్‌ను రాజేంద్రనగర్‌కు తరలిస్తాం.

-అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌.

చేవెళ్ల, అక్టోబరు 19(ప్రజాక్షేత్రం):గత బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆరోపించారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసిందని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందన్నారు. శనివారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని స్థానిక కేజీఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమిది పెంటయ్యగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ బి.రాములు, పాలక వర్గం సభ్యులు స్పీకర్‌ సమక్షంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ – బీజాపూర్‌ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి, సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడుతానని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పంచాయతీరాజ్‌ శాఖ నుంచి రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి మరో రూ.50 కోట్లు విడుదల కానున్నాయని స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని త్వరలోనే రాజేంద్రనగర్‌కు తరలించేలా సీఎం రేవంత్‌తో చర్చిస్తామన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ… కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్‌ నియంత్రణ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి, ముడిమ్యాల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ గోనే ప్రతా్‌పరెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌, మాజీ జెడ్పీటీసీ మాలతి, నాయకులు సున్నపు వసంతం, షాబాద్‌ దర్శన్‌, జనార్దన్‌రెడ్డి, యాదగిరి, పట్నం రాంరెడ్డి, బల్వంత్‌రెడ్డి, శంకర్‌, శ్రీనివా్‌సగౌడ్‌, పాండు, నర్సింలు, వీరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, కుమ్మరి చెన్నయ్య, రాములు, బండారు శైలజ, దేవర సమతారెడ్డి, మహమ్మద్‌ రియాజ్‌, ఆశ్వక్‌, సుజాత, మహేందర్‌ పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొందరు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. నాయకులు వేదికపైకి వెళ్లే సమయంలో జనం తోసుకున్నారు. ఈ సమయంలో నాయకుల జేబుల నుంచి డబ్బులు కొట్టేశారు.

Related posts