- ట్యాంక్‌బండ్ విగ్రహం చుట్టూ ఏడడుగుల గోడ
- ఏండ్లుగా ఇక్కడే నిరసన తెలుపుతున్న పీడిత వర్గాలు
- దళిత సంఘాల ఆగ్రహం.. అర్ధరాత్రి గోడ కూల్చివేత
హైదరాబాద్, అక్టోబర్ 22(ప్రజాక్షేత్రం):నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది రేవంత్ సర్కార్ తీరు. ఓవైపు నిరుపేదల గూడు కూలుస్తూ.. వారి బతుకులను రోడ్డుపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కోట్ల మంది భారతీయుల ఆరాధ్యుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంతో చెలగాటమాడేందుకు ప్రయత్నిస్తున్నది. ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం ఎన్నో దశాబ్దాలుగా ఆయన అభిమానులకు కష్టసుఖాలు చెప్పుకొనేందుకు ఆదరువుగా నిలుస్తున్నది. ఆయన జయంతి, వర్ధంతి సం దర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించే ప్రజలు ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేయడానికి ఆయన విగ్రహాన్నే వేదికగా చేసుకుంటున్నారు.ఈ విగ్రహానికి పలుమార్లు క్షీరాభిషేకం చేశారు. అటువంటి విగ్రహం చుట్టూ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏడడుగుల గోడ నిర్మించింది. ఆ విగ్రహం వద్దకు చేరి నిరసన తెలిపేందుకు అవకాశం లేకుండా గోడతో చక్రబంధం వేస్తున్నది. ఈ పోకడలపై ప్రజా సంఘా లు మండిపడుతున్నాయి. ‘అంబేద్కర్‌ను గోడతో బంధించగలరా?’ అంటూ రేవంత్‌ను ప్రశ్నిస్తున్న పోస్టులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఎస్సీలను వర్గీకరించకుండా ద్రోహం చేస్తున్న రేవంత్ ఇప్పుడు తమ ఆరాధ్యుడిని కూడా కనిపించకుండా, అక్కడికి వెళ్లి నిరసన తెలపకుండా చేయడం అవివేకమని విమర్శిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలకు దూరం చేసేలా గోడ నిర్మించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ విమర్శించారు. కాగా అర్ధరాత్రి ఈ గోడను దళిత సంఘాలు కూల్చాయి.