హైదరాబాద్లో పోలీస్ కుటుంబాల ధర్నా .. కారణమిదే
హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజాక్షేత్రం):హైదరాబాద్లోని కొండాపూర్ చౌరస్తాలో కొండాపూర్ 8వ బెటాలియన్ ముందు పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు శుక్రవారం భారీ ధర్నా చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి కానిస్టేబుళ్ల భార్యలు, పిల్లలు ఆందోళనకు దిగారు. ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘వి వాంట్ ఎక్ పోలీస్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో గచ్చిబౌలి కొండాపూర్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ని కొత్తగూడ కొండాపూర్ ఫ్లై ఓవర్ మీదుగా మళ్లించారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో బెటాలియన్ ప్రధాన ద్వారం ముందు బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులతో బెటాలియన్ కానిస్టేబుళ్లు గొడవపడుతున్నారు.
కూలీలుగా మార్చి, వేధింపులకు గురి చేస్తున్నారు…
మరోవైపు గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న తమ భర్తలను అధికారులు కూలీలుగా మార్చి, వేధింపులకు గురి చేస్తున్నారంటూ 17వ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తెలంగాణలో ఏక్ స్టేట్ – ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో అంబేద్కర్ విగ్రహం వద్దకు బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు తరలి వచ్చి బైఠాయించారు.
న్యాయం చేయాలి…
తమ భర్తల సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని సర్ధాపూర్లోని బెటాలియన్ వద్దకు తరలించారు. కమాండెంట్ శ్రీనివాసరావు వారి సమస్యలను విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్ల భార్యలు మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగానికి తమ భర్తలు చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోయిందన్నారు. పోలీసు ఉద్యోగం పేరుతో బెటాలియన్లో కూలి పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భర్తలు డ్యూటీ చేయాలంటే భయంతో వణికిపోతున్నారని అన్నారు.
సెలవులు ఇవ్వట్లేదు..
ఇళ్లలో శుభకార్యాలు జరుపుకోవడానికి కూడా సెలవులను ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. బెటాలియన్లో పనిచేసే వారు చనిపోతే కానిస్టేబుళ్లే అంత్యక్రియలు చేయాలని, వారే డప్పులు కొట్టాల్సిన దుస్ధితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పోలీసు విధానాన్ని తెలంగాణలో అమలు చేసి తమ భర్తలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. డిచ్పల్లిలో ఆందోళన విరమించాలని కోరగా వినకపోవడంతో.. పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లి.. అక్కడి నుంచి పంపించివేశారు.