లగచర్ల గిరిజనులపై కుట్రపూరిత కేసులు
షాద్‌నగర్, నవంబరు 16(ప్రజాక్షేత్రం):లగచర్ల గిరిజన రైతులను పరామార్శించడానికి లంబాడి హక్కుల పోరాట సమితి ఈనెల 20న చలో లగచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్ మాట్లాడుతూ చలో లగచర్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భూసేకరణ, పోలీసుల దాడుల్లో గాయపడ్డవారిని పరామర్శించేందుకే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండల పరిధిలోని రోటిబండ తండా, పులిచెర్లకుంట తండా, మైసమ్మగడ్డ తండా, గడ్డమీది తండా, ఈదులకుంట తండాలో తమ బృందం సభ్యులు పర్యటించి బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. లగచర్ల ఘటనపై బాధితులను పరామార్శించడానికి వెళ్లిన బీజేపీ ఎంపీ డీకే అరుణను అడ్డుకున్నా.. ఆ నేతలు స్పందించకపోవడం గమనార్హమన్నారు. తన నియోజకవర్గ పరిధిలో పర్యటించేందుకు వెళ్లుతున్న ఒక ఎంపీని పోలీసులు అడ్డగించారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు.