Praja Kshetram
తెలంగాణ

కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..

కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..

 

హైదరాబాద్ నవంబర్ 24(ప్రజాక్షేత్రం):డిసెంబర్ 1నుంచి 9వ తేదీ వరకూ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. తొమ్మిది రోజులపాటు శాఖల వారీగా జరిగే ఈ విజయోత్సవ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వరసగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాలకూ ఈ వేడుకల్లో ప్రాధాన్యమివ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో 26 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 7 వరకూ అన్ని గ్రామాల్లో సీఎం కప్ పోటీలు నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. 16 కొత్త నర్సింగ్ కాలేజీలతోపాటు 28 పారా మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గోషామహల్‌లోని ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఆరంఘర్ జూపార్క్ ఫ్లై ఓవర్, ఆరు ఎస్టీపీలను ముఖ్యమంత్రి ప్రారంభించేందుకూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేబీఆర్ పార్కు సమీపంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లతో ఆరు జంక్షన్లు అభివృద్ధి చేసే రూ.826 కోట్ల భారీ ప్రాజెక్టుకు సైతం ఈ వేడుకల్లో శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇందిరా శక్తి మహిళా బజార్ ప్రారంభించేందుకు ప్రణాళికలు రచించారు. దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఒక యూనిట్‌ను జాతికి అంకితం చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 237 సబ్ స్టేషన్ల ఏర్పాటుకు సైతం ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరగతుల ప్రారంభం కాగా.. స్పోర్ట్ యూనివర్సిటీకి ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు.

 

 

Related posts