రైతు భరోసాపై సీఎం గుడ్న్యూస్
-సంక్రాంతి తర్వాతే రైతుభరోసా
-రైతులకే కాంగ్రెస్ తొలి ప్రాధాన్యం
-సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతుభరోసా సొమ్ము
-మారీచుల మాయమాటలు నమ్మొద్దు
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజాక్షేత్రం):లక్షలాది మంది రైతులు ‘రైతుపండుగ’లో పాల్గొన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడుతూ… రూ. 7 లక్షల కోట్ల అప్పులతో కేసీఆర్ తమకు ప్రభుత్వాన్ని అప్పగించారని చెప్పారు. ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని సీఎం, మంత్రులు, అధికారులు ఎవరూ చెప్పలేదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాము అధికారం చేపట్టిన వెంటనే ఆస్తులు-అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై తాము ప్రతినెలా రూ. 6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని ఆరోపించారు. భారీగా ఉన్న అప్పు చూసి కూడా అధైర్యపడకుండా పాలన సాగిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని రేవంత్ రెడ్డి వివరించారు. నెహ్రూ నుంచి నేటివరకు రైతులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీని సూచించారు. కేసీఆర్ బకాయి పెట్టిన రైతుబంధును తాము అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెలరోజులకే రూ. 7,625 కోట్లు రైతుబంధు నిధులు చెల్లించామని వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి 22.22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం.. ఆగస్టు 15 నాటికి రైతుల ఖాతాల్లో దాదాపు రూ. 18 వేల కోట్లు జమచేశామన్నారు. నిన్న కూడా 3.14 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,747 కోట్లు వేశామని చెప్పారు. ఇప్పటివరకు 25.35 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్లు రుణాలు మాఫీ చేశామని సీఎం తెలిపారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పదేళ్ల పాటు మోసం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేసేందుకు ఐదేళ్లు పట్టింది.. ఐదేళ్లకు రుణమాఫీ చేయడంతో అసలు కంటే వడ్డీ ఎక్కువ పెరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి కూడా ఐదేళ్లలో విడతలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పింది.. కేసీఆర్ ప్రభుత్వం రెండో సారి ఐదేళ్లో కూడా రుణమాఫీని పూర్తి చేయలేదని సీఎం రేవంత్ విమర్శించారు. సంక్రాతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతుభరోసా సొమ్ము వేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం రైతుభరోసాను కొనసాగిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. మారీచుల మాయమాటలను రైతులు నమ్మొద్దని సీఎం రేవంత్ కోరారు. రైతుభరోసా విషషయంలో దుష్ర్పచారాన్ని రైతులు నమ్మొద్దన్నారు. రైతుభరోసా విధివిధానాలపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాము.. చేసి చూపించాం.. రైతుభరోసా ఇస్తామని చెప్పాము.. ఇచ్చి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం వానాకాలం రైతుబంధును పెండింగ్ లో పెట్టి పోయింది.. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ. 7600 కోట్లు రైతుబంధులు తామే ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. వరి వస్తే.. ఉరే అని మాజీ కేసీఆర్ అన్నారు.. కేంద్రం వడ్డుకొంటలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనదు అని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వరికి రూ. 500 బోనస్ ను కూడా కొనసాగిస్తామన్నారు. రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తామని చెప్పాం.. ఇచ్చితీరుతామని సీఎం వెల్లడించారు. ప్రజలు నాణ్యమైన సన్నవడ్లు పండించాలని విజ్జప్తి చేస్తున్నమన్నారు. మన రైతులు పండించిన సన్నవడ్లు మళ్లీ ప్రజలకే చేరుతాయని చెప్పారు. రూ. 2 లక్షల వరకు రుణం అందరికీ రుణమాఫీ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.